GNTR: కాకుమాను మండలం అప్పాపురం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మురిగిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. పసిపిల్లలకు పౌష్టికాహారం కింద పాడైన గుడ్లు ఇస్తుండటం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అనంతపురంలో విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాల్లో ఫెర్రర్ చేసిన సేవలను మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఈ ఏడాది ఆర్డీటీకి FCRA అనుమతి సాధించి, సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాగేలా కృషి చేశామని పేర్కొన్నారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని లోకేశ్ కొనియాడారు.
AKP: నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలమంచిలి ఎంపీపీ రాజాన శేఘ సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జలధార-జల హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలన్నారు. సాగునీటి కాలువల మరమతులు చేయించాలన్నారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సందర్శించారు. ప్రస్తుతం 200 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డీసీవీ ఛైర్మన్ బాబు ఆదేశించారు.
PLD: నరసరావుపేట (M) ములకలూరులో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వల్ల రైతులకు లాభాలున్నాయని తెలిపారు. పరిశుభ్రత కోసం ప్రజలంతా చెత్తను వేరుచేసి ఇవ్వాలని ఆయన సూచించారు.
సత్యసాయి: కదిరి మండలం పట్నం గ్రామంలో విషాదం నెలకొంది. పొలం వద్ద పంట కోసం ఉంచిన యూరియా కలిపిన నీరు తాగి 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి క్రిష్ణ మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, గొర్రెలు దాహంతో బకెట్లలోని నీటిని తాగాయి. కొద్దిసేపటికే కడుపు ఉబ్బి అవి ప్రాణాలు విడిచాయి. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు తీవ్రమయ్యాయి. బుధవారం చాగలమర్రిలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 41.8, కౌతాళంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యుడి భగభగలతో మధ్యాహ్నం పట్టణాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాల్పుల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
ATP: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 15వ తేదీ నుంచి సీసీటీవీ కెమెరా ఇన్ స్ట్రాలేషన్ కోర్సు పై ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శాంతి ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉండి టెన్త్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం 9705091727 సంప్రదించాలన్నారు.
కృష్ణా: పెడన మండలం మడిచర్ల గ్రామంలో చెరువును సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావుతో కలిసి కలెక్టర్ బాలాజీ ఈరోజు పరిశీలించారు. చెరువు స్థితిగతులను వారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని చెరువులను వర్షపు నీటితో నింపుకొని రైతులకు ఏలాంటి కొరత లేకుండా ఎల్లప్పుడూ సాగునీరు అందిస్తామన్నారు.
VZM: విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వి.చందపు నాయుడు మద్దివలస కొట్టిశ రోడ్డులోని చెరువుగట్టు వద్ద ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ వైర్లు ఆవుకు తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడే మృతి చెందింది.
E.G: నల్లజర్ల(M) ప్రకాశరావుపాలెం శివారు వైఎస్సార్ యూనివర్సిటీ సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
W.G: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు ఇంఛార్జ్ కాకర్ల శ్రీను ఇంటి వద్ద గురువారం ఉదయం ఏర్పాటు చేసిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో వైసీపీ తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ వడ్డే రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో దుర్గ ప్రసాద్, సతీష్, శ్రీను వార్డు ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలం నేకనాపురం ఎస్సీ కాలనీలో గంగమ్మ జాతర సందర్భంగా గురువారం ఉదయం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని బోనాలను మోసుకుంటూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పుల మోత, భక్తుల జైకారాలతో కాలనీ అంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
KRNL: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న జిల్లాలోని అన్ని గ్రామ శాఖల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యదర్శి పంపన గౌడ్ పిలుపునిచ్చారు. నందవరంలో బుధవారం మాట్లాడుతూ.. 1936 ఏప్రిల్ 11న ఆల్ ఇండియా కిసాన్ సభ స్థాపించబడిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి రైతుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మపై వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని టీడీపీ నేతలు మండిపడ్డారు. బుధవారం కొలిమిగుండ్ల టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.