PLD: ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో గురువారం ‘బడిబాట’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో పర్యటిస్తూ విద్యా ప్రాముఖ్యతను వివరించారు. బడి ఈడు పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రకాశం: గిద్దలూరు వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపి నాగార్జున రెడ్డిని రాచర్ల నాయకులు గురువారం మార్కాపురంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న జరగనున్న శ్రీ గంగమ్మ తల్లి పోతురాజు దేవస్థానం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు గ్రామ నాయకులు వెల్లడించారు.
CTR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్ పై స్పష్టత రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. దీనిని పరిశీలించాల్సి ఉందని.. రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం వ్యతిరేకిస్తామని వెల్లడించారు.
SKLM: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ASR: వరరామచంద్రపురం మండలం శబరి బ్రిడ్జ్ సమీపంలోని కమ్మరివాడ వద్ద గురువారం ఉదయం శబరి నది ఒడ్డున ఓ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని ఎస్సై సాధిక్ తెలిపారు.
అనకాపల్లి: నర్సీపట్నం ఫైర్ ఆఫీస్ వద్ద గురువారం నూతన అగ్నిమాపక వాహన సకటాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నంలో మరో నూతన అగ్నిమాపక వాహనం రావడం సంతోషంగా ఉందన్నారు. 9 మండలాల ప్రజలకు విశిష్ట సేవలు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
KDP: నగరంలో తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ రామన్నపల్లి, వాటర్ గంటి పంపింగ్ హౌస్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపింగ్ కేంద్రాల్లో నిర్వహణ పనులు, యంత్రాల పనితీరును కమిషనర్ సమీక్షించారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. స్థానిక కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న దేవలపల్లి వేద్య, దేవులపల్లి విద్య మంచి మార్కులు సాధించారు. వేద్య (అక్క) 444, విద్యకు (చెల్లి)కి 440 మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా వారిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
TPT: సత్యవేడు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు సత్యవేడు వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం వాసి కర్నాటి గురువారెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి కంభం ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట ఎంపీపీ ఓసూర రెడ్డి, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
W.G: భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనం పూర్తయితే రోజుకు సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నాగభూషణం, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.
NDL: టీడీపీ కమిటీలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబుకు గురువారం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కలపటపు బుచ్చి రాంప్రసాద్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమితులైన విజయకుమార్, జ్యోత్స్న, రాష్ట్ర కార్యదర్శి లోహిత్ నియామకం హర్షణీయమన్నారు.
సత్యసాయి: కదిరి మహిళ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ పర్వీన్ భాను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు పర్వీన్ భాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
KDP: పులివెందులకు చెందిన యువతి పి.మన్విత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి SSC, CGLఫలితాల్లో GST ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పట్టుదలతో శ్రమించి, ఈ ఘనత సాధించడంతో పట్టణంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం NIT కలకత్తాలో బీటెక్ పూర్తి చేశారు. బంధుమిత్రులు ఆమె నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
BPT: చీరాల పట్టణంలోని 9వ వార్డులో ప్రజల ఫిర్యాదుల మేరకు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలిసి వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి, కాలువలను శుభ్రం చేశారు. సాధారణంగా చేపట్టే విధంగా ఈ పనులను నిర్వహించి, వార్డులో శుభ్రతకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు తెలిపారు.