KDP: ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ కార్మిక చట్టాల అమలులోను సీఐటీయూ కీలకపాత్ర పోషిస్తోందని సీఐటీయూ గౌరవాధ్యక్షుడు ఏసుదాసు పేర్కొన్నారు. జమ్మలమడుగులోని పాత బస్టాండ్ దగ్గర సీఐటీయూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల పెంపుకు తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానిపురంలోని NDA కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వినతులు స్వీకరించారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. సుజనా ఫౌండేషన్, సీడ్స్, క్రిస్ప్ సహకారంతో అంగన్ వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పౌర్ణమి సందర్భంగా ఆదివారం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5:55 గంటలకు ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్ మీదుగా సాగి శ్రీ మల్లిఖార్జున మహా మండపం వద్ద ముగుస్తుందని తెలిపారు.
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గోంతేరు కాలువలో శనివారం గుర్తు తెలియని వృద్ధురాలి (65) మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికుల సమాచారంతో వీఆర్వో శ్యామ్యూల్ రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఆమె గులాబీ రంగు జాకెట్, సిమెంట్ రంగు లంగా ధరించి ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై కె.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. శనివారం అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ పరిశ్రమను ఆయన సందర్శించారు. దీని ద్వారా గ్రామీణ మహిళలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుపై ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు.
CTR: చిత్తూరు జిల్లాలో ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్ లను అందజేయనున్నట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. నగరిలో శనివారం జనవిశ్వాస్-సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్లను అతికించారు. డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. స్కానర్ ద్వారా ఆటో వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
ప్రకాశం: గిద్దలూరు (మం) అంబవరం స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో శ్రీ కే. సీతారామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించిన ఆయన, పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
NLR: గుడ్లూరు మండలం గుండ్లపాలెం క్రాస్ రోడ్డు వద్ద శనివారం హెల్మెట్ ధరించడంపై ప్రత్యేక తనిఖీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై వెంకట్రావు వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అన్నమయ్య: రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఐటీయు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేల్ రవికుమార్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన, కనీస వేతనాల అమలు, లేబర్ కోడ్ల రద్దు కోసం సీఐటీయు నిరంతరం పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
VZM: గత 40 రోజులుగా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఇవాళ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులను అభినందించారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు.
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు జి.సిగడం మండల కేంద్రంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పశువులకు ఉచిత పరీక్షలు, చికిత్సలు, మందులు పంపిణీ చేశారు. పాడి రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
CTR: రాష్ట్రవ్యాప్తంగా శనివారం 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ భౌతిక శాస్త్ర పరీక్ష ముగిసింది. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షకు మొత్తం 3,461 మంది విద్యార్థులకు గాను 3,128 మంది హాజరయ్యారని, 513 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. అలాగే, ఇదే రోజు జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మరో 18 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
KDP: సీ.కే.దిన్నె మండల కేంద్రంలోని PHCని శనివారం ఇంచార్జ్ DMHO డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాతృ-శిశు సంరక్షణ, వంద శాతం ప్రభుత్వ ప్రసవాలు, చిన్నారుల టీకాలు, సీజనల్ వ్యాధుల నివారణ, బయోమెట్రిక్ హాజరుపై సూచనలు చేశారు.
అనకాపల్లి జిల్లాలో వివిధ దేవాలయాల్లో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో DSP మాట్లాడుతూ.. నిందితుడు జి. రాజుతో పాటు మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా స్థానిక దేవాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.4.45 లక్షల విలువైన ఆస్తిని చోరీ చేసినట్లు గుర్తించామన్నారు.
సత్యసాయి: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ మహానాడులో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను నేతృత్వంలో వందలాది మంది మహిళలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు.