గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎస్.ఎస్.వీ. రమణ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. జింఖానా బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో డా. రమణను ఘనంగా సత్కరించారు. నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావంతో విధులు నిర్వహించిన డా. రమణ సేవలు ఆదర్శప్రాయమన్నారు.
KDP: మైదుకూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. యువతకు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్న లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణను నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ విద్యను పూర్తి చేసినవారు, అంతకంటే విద్యార్హత ఎక్కువ ఉన్నవారు అర్హులన్నారు.
SKLM: పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురంకి చెందిన కే. సరస్వతి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆమె సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చెయ్యగా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 3 లక్షలు చెక్కును స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం తన కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.
ASR: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి శనివారం రంపచోడవరంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం 12 గంటలైనా సంబంధిత అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సత్యసాయి: మడకశిర ప్రాంతంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. ప్రత్యేక నిఘా, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
NLR: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటివార్‌తో కలిసి శనివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ATP: అనంతపురం జనరల్ హాస్పిటల్‌లోని తల్లిపాల కేంద్రాన్ని ఐహెచ్‌ఆర్‌సిఐ నేషనల్ సీనియర్ సెక్రటరీ డాక్టర్ భాస్కర్ నాయుడు సందర్శించారు. మిషన్ వాత్సల్యలో భాగంగా అనాథ పిల్లలకు తల్లిపాల పంపిణీని పరిశీలించారు. డాక్టర్ హేమలత మాట్లాడుతూ.. తల్లుల నుంచి సేకరించిన పాలకు స్క్రీనింగ్ పరీక్షలు చేసి, పాశ్చరైజేషన్ విధానంలో -20°C వద్ద నిల్వ చేస్తామని చెప్పారు.
VSP: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవో K. శోభారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం దేవస్థానం ఈవో నక్క ఆనంద్ తన పదవీ విరమణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
KDP: ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ కార్మిక చట్టాల అమలులోను సీఐటీయూ కీలకపాత్ర పోషిస్తోందని సీఐటీయూ గౌరవాధ్యక్షుడు ఏసుదాసు పేర్కొన్నారు. జమ్మలమడుగులోని పాత బస్టాండ్ దగ్గర సీఐటీయూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల పెంపుకు తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానిపురంలోని NDA కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వినతులు స్వీకరించారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. సుజనా ఫౌండేషన్, సీడ్స్, క్రిస్ప్ సహకారంతో అంగన్ వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
ELR: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. శనివారం బుట్టాయగూడెం మండల కేంద్రంలో ఉన్న ఆదివాసి విజ్ఞాన కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ.. పొగాకుకు మద్దతు ధర కల్పించడంతో పాటు, సోమనాథ్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు కొనుగోలులో జాప్యాన్ని నివారించడానికి బోర్డు 500 కోట్లు కేటాయించాలన్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పౌర్ణమి సందర్భంగా ఆదివారం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5:55 గంటలకు ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్ మీదుగా సాగి శ్రీ మల్లిఖార్జున మహా మండపం వద్ద ముగుస్తుందని తెలిపారు.
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గోంతేరు కాలువలో శనివారం గుర్తు తెలియని వృద్ధురాలి (65) మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికుల సమాచారంతో వీఆర్వో శ్యామ్యూల్ రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఆమె గులాబీ రంగు జాకెట్, సిమెంట్ రంగు లంగా ధరించి ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై కె.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్‌టైల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. శనివారం అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ పరిశ్రమను ఆయన సందర్శించారు. దీని ద్వారా గ్రామీణ మహిళలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటుపై ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు.
CTR: చిత్తూరు జిల్లాలో ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్ లను అందజేయనున్నట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. నగరిలో శనివారం జనవిశ్వాస్-సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్లను అతికించారు. డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. స్కానర్ ద్వారా ఆటో వివరాలు తెలుసుకోవచ్చన్నారు.