KRNL: తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న జనగణన-2027లో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. ఈ విధానం ద్వారా ప్రతీ కుటుంబం తమ ఇంటి వివరాలను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వెబ్సైట్ www.se.census.gov.inలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
AKP: దేవరాపల్లి మండల ఎంపీడీవోగా ఎస్. కిరణ్ వరప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎం.వి. సువర్ణరాజు జిల్లా కోఆర్డినేటర్ (ఎస్ఈబ్ల్యూపీసీ)గా డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆయన స్థానంలో కిరణ్ వరప్రసాద్ నియమితులయ్యారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
SKLM: అరసవిల్లి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన “అభయం హెల్మెట్ బ్యాంక్” ను సోమవారం సాయంత్రం SP మహేశ్వర రెడ్డి సందర్శించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు .
ప్రకాశం: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. హైవే అంబులెన్స్ గాయాలైన వారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది.
KDP: కమలాపురం మండలంలోని చదిపిరాళ్ల గొల్లపల్లె గ్రామాల మధ్యన వెలసిన మంచాలమ్మ పాలేటి గంగమ్మ తిరునాళ్ళు మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉదయం అమ్మవారికి పూజలు, అభిషేకాలు, ప్రధాన కలశ స్థాపన, అఖండ దీపారాధన నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరన్నారు.
CTR: పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుషార్, చిత్తూరు సాయుధ దళం కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 72 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. భూతగాదాలు 19, నగదు లావాదేవీలు 12, కుటుంబ సమస్యలు 11 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. వీటిని పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
BPT: బల్లికురవ మండలం ముక్తేవ్వరం గ్రామానికి చెందిన రజని అనే వివాహిత ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయారు. ఆమె సోదరుడు రామకోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు సోమవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థల కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం.
VZM: ఇంధనం కోసం పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చీపురుపల్లి MLA కళా వెంకటరావు సూచించారు. సోమవారం తమ నివాసంలో RDO సుధారాణి, DSP రాఘవులుతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బంకులు మూతపడకుండా చూడాలని, ఈ విషయంలో CM సీరియస్‌గా ఉన్నారని అన్నారు.
KKD: పిఠాపురంలో ఇంటి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేందుకు మరో రెండు రోజులే సమయం ఉందని కమిషనర్ కనకారావు సోమవారం తెలిపారు. ఈ నెల 30 లోపు పన్ను చెల్లిస్తే పాత బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ, ప్రస్తుత పన్నుపై 5% రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిస్తే రాయితీలు వర్తించవన్నారు.
NDL: ఉయ్యాలవాడలో జరుగుతున్న గంగ జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్సై రామిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఇవాళ, రేపు గ్రామానికి నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల కోసం 4 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. ఆళ్లగడ్డ నుంచి ఉయ్యాలవాడ మీదుగా JMD, KKL వెళ్లే వాహనదారులు దొర్నిపాడు మీదుగా వెళ్లాలన్నారు.
తూ.గో: జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా శ్రీక్షితిజ్ ఆదిత్య శర్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి విధులకు రిపోర్ట్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా అందాలని, ప్రజలకు జవాబుదారితనం, పారదర్శకతతో సేవలందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆయనకు దిశానిర్దేశం చేశారు.
VSP: విశాఖ రైతు బజారులో కూరగాయల ధరలు మంగళవారం స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. టమాటా రూ.37, ఉల్లిపాయ రూ.17, బంగాళదుంప రూ.12గా ఉన్నాయి. వంకాయ రూ.30, మిర్చి రూ.28, కాకరకాయ రూ.48, మునగకాడలు రూ.42 పలుకుతున్నాయి. ఇతర కూరగాయలు సాధారణంగా లభిస్తుండగా, నిమ్మకాయ ధర మాత్రం రూ.180కు చేరి వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది.
AKP: ఎలమంచిలిలోని పెంజెరువు పరిరక్షణకు మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. కమిషనర్ ప్రసాద్ రాజు ఆదేశాలతో చెరువు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చెరువులో చెత్త, వ్యర్థాలు వేస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని శానిటైజేషన్ సెక్రటరీ ఆశీర్వాద్ తెలిపారు. ప్రజలు సహకరించాలని సెక్రటరీ కోరారు.
సత్యసాయి: కదిరి మండలం చిగురుమంతాండ పంచాయతీ పరిధిలోని చిగురుమామి తండాలో విషాదం చోటుచేసుకుంది. బి. రవి నాయక్‌కు చెందిన 18 పొట్టేళ్లు ఒక్కసారిగా మృతి చెందాయి. తీవ్ర ఎండలు, వడదెబ్బతో పాటు మందు ప్రభావం కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనతో రైతు కుటుంబంలో దుఃఖం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు: జిల్లాలో డీజల్, పెట్రోలు కొరత లేదని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని కోవూరు MLA ప్రశాంతి రెడ్డి తెలిపారు. సోమవారం కోవూరు జాతీయ రహదారిపై పెట్రోల్ బంకును ఆమె తనిఖీ చేశారు. బంకులో ఉన్న నిల్వలు, రికార్డులను స్వయంగా పరిశీలించారు. ఇంధన కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో అధికారులు చర్యలు చేపట్టారని ఆమె స్పష్టం చేశారు.