BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్టలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావమై, క్షతగాత్రుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VSP: గాజువాక 75వ వార్డ్ చిన కోరాడ SC కాలనీలో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ SC/ST యోజన’ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అందరూ వినియోగించుకోవాలని సూచించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు. పెద గంట్యాడ మండలంలో సుమారు 350 మంది అర్హులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
KRNL: ఆస్పరి మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇవాళ MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వారాలకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణం లేదా హంద్రీ నీవా కాల్వ నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.
KDP: ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ బెస్తపల్లి గ్రామంలో వ్యవసాయ నష్టంతో సారా సురేష్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలు విఫలమవడంతో అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతను పొలంలో పురుగుల మందు సేవించాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ ఇంఛార్జ్‌లతో భేటీ అయిన సీఎం, రాజకీయాలు, పరిపాలనలో గత అనుభవాలు, ప్రస్తుత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై కార్యకర్తలకు విస్తృతంగా వివరించారు.
BPT: ఏప్రిల్ నెల 19వ తేదీన బాపట్లలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుని అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు.
అన్నమయ్య: మదనపల్లె వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పాత కేసులో పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1లక్ష విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం చేపట్టింది.
CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి.. భక్తులు ఆలయం వెలుపలకు వచ్చారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు పర్యవేక్షించారు.
E.G: బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో MPDO శ్రీనివాస్ అధ్యక్షతన జలధార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బిక్కవోలు MPP సుమ పాల్గొని, మాట్లాడారు. జలవనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువులు, నీటి వనరులను పరిరక్షించాలని ఎన్డీఏ కన్వీనర్ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల త్రిమూర్తులు, చిట్టిబాబు చౌదరి పాల్గొన్నారు.
KDP: ముద్దనూరు టౌన్లో ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారం దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. హేబ్రోన్ చర్చి వీధికి చెందిన నాగలచ్చమ్మ తన తల్లి చికిత్స కోసం బయటకు వెళ్లగా, ఈ ఘటన జరిగింది. సుమారు రూ.20 వేల నగదు, 3 గ్రాముల బంగారం అపహరించబడినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలోని రాయల చెరువు సమస్యలను పరిష్కరించాలని నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత అవగాహన కార్యక్రమంలో జేఈ సంజీవ్ కుమార్‌ను టీడీపీ సీనియర్ నేత వీరేష్ గౌడ్, సాగునీటి సంఘం అధ్యక్షులు నారాయణ శనివారం డిమాండ్ చేశారు. చెరువు గట్టుపై ముళ్ల కంపలు పెరిగి పోయాయని, దీంతో గట్టు బలహీనపడే ప్రమాదం ఉందని జేఈ దృష్టికి తీసుకెళ్లారు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా పుల్లంపేట మండలం శ్రీరాములపేట గ్రామంలో కార్డాన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి అనుమానితులను తనిఖీ చేశారు.
NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మైకేల్ స్విమ్మింగ్ పూల్, గేమింగ్ జోన్‌ను శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
PPM: గుమ్మలక్ష్మీపురంలో జనగణన మొదటి విడత సర్వేను సిబ్బంది ఖచ్చితంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. శనివారం జడ్పీ హైస్కూల్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్నిఆమె పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి తప్పుల్లేని సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. దేశ అభివృద్ధికి జనగణన కీలకమని ఆమె పేర్కొన్నారు.
NLR: యుద్ధం కారణంగా వైజాగ్‌లో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరు ఇరాన్ మహిళలకు ఏపీ వర్ఫ్ బోర్డు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందించింది. బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి ధైర్యం చెప్పి, నిధులను అందజేశారు. కష్టకాలంలో ఉన్న విదేశీయులకు కూటమి అండగా ఉంటుందని.. సీఎం చంద్రబాబు సహకారంతోనే నిధులు అందించామన్నారు.