SKLM: పలాస ప్రాంత ప్రజలకు దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే శిరీష పరిశీలించారు. ఈ మేరకు పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
ATP: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎండాకాలం కావడంతో తగినన్ని ఫ్యాన్లు, చల్లని తాగునీరు కొరత లేకుండా ఉండేందుకు డీఈఓ ప్రసాద్ బాబు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు సిబ్బందితో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు.
ATP: జిల్లాకు సీఎం చంద్రబాబు వస్తుండటంతో ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతపురంతో పాటు పొరుగున ఉన్న 6 జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. జిల్లా నుంచి 517 మంది, ఇతర జిల్లాల నుంచి 716 మంది సిబ్బందిని ఈ విధులకు నియమించారు. వీరితో పాటు ఏఆర్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు.
NTR: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. కండ్రిక జంక్షన్ వద్ద రత్నాకుమార్ వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ATP: అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి ‘మిస్సైల్ ఉమెన్’గా పేరొందిన డా.టెస్సీ థామస్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ అయిన ఆమెకు ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు.
BPT: వేటపాలెం మండలం దేశాయిపేట పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్‌లు మితిమీరాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బంతికి పందేలు కాస్తూ శ్రామికులు, ఉద్యోగులు కష్టార్జితం పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ మోజులో భర్తలు అప్పుల పాలవుతున్నారని మహిళలు వాపోతున్నారు. లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.
GNTR: జిల్లాలో 5 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ROB నిర్మాణానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. శ్యామలనగర్, సంజీవయ్యనగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అమరావతి ఈ-13 రోడ్, నంబూరు-మంగళగిరి మార్గాల్లో అధ్యయనం చేపడతామని అధికారులు తెలిపారు. ఈ నెలలోనే కన్సల్టెన్సీ ఎంపిక చేసి DPR సిద్ధం చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా నెహ్రూనగర్, సంజీవయ్యనగర్ గేట్లకు ప్రాధాన్యం ఇచ్చారు.
CTR: గంగవరం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతి కోర్టులో పనిచేసే యుగంధర్, హరీశ్‌తో పాటు మరికొందరు IPL మ్యాచ్ నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. అర్ధరాత్రి కారులో తిరిగి బయల్దేరారు. గంగవరం మండలం దండపల్లి బైపాస్ సమీపంలో లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో యుగంధర్, హరీష్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు క్షేమంగా బయటపడ్డారు.
ప్రకాశం: మార్కాపురం అటవీ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో పనిచేయుటకు ఏదైనా డిగ్రీ, MS ఆఫీస్, టైప్ స్కిల్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీటెక్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీలోపు సమర్పించాలన్నారు.
SKLM: టెక్కలి పట్టణానికి మణిహారంగా నిలిచిన పట్టు మహాదేవి కోనేరు త్వరలోనే ఆధునిక సౌకర్యాలతో నూతన రూపు దాల్చనుంది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పై అధికారులు తో సమీక్ష నిర్వహించారు. పనులు అత్యున్నత నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
NDL: కుందూ నదిలో కాలు జారి పదేళ్ల బాలిక మృతి చెందింది. ఆదివారం నంద్యాల మండలం హైస్కూల్ కొట్టాలకు చెందిన షేక్ సుభాన్ బాషా కుటుంబంతో బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు ఆనకట్టకు వెళ్లారు. అక్కడ షేక్ షబానా నీటిలో పడటంతో వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
KRNL: తుగ్గలి మండలంలోని ఎద్దులదొడ్డి గ్రామంలో పొలం రస్తా వివాదం ఆదివారం నాడు దాడికి దారితీసింది. ఈ ఘటనలో రంగప్పనాయుడు అనే వ్యక్తిపై కొడవళ్లతో దాడి జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, అదే గ్రామానికి చెందిన రాజశేఖర్, రవితేజతో పాటు మరో ఐదుగురిపై తుగ్గలి ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు.
W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భక్తులు బంగారు విరాళాలు అందజేశారు. వడ్డీ దివ్య, వీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాములు, మోటూరుకు చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సిబ్బంది పాల్గొని దాతలను అభినందించారు.
KDP: మైదుకూరు (M) ఉప్పగుంటపల్లెలో 17వ శతాబ్దం నాటి అరుదైన చాముండేశ్వరి దేవి విగ్రహం వెలుగుచూసింది. స్థానిక పొలాల్లోని నాగులపుట్ట వద్ద శుభ్రం చేస్తుండగా ఈ అద్భుత శిల్పం బయటపడినట్లు చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ నిన్న తెలిపారు. శిల్పంలో దేవి 4 చేతులలో ఢమరుకం,ఖడ్గం,త్రిశూలం,అసురుని తల పట్టుకుని, పాదాల కింద రాక్షసులను అణచివేస్తూ సుఖాసనంలో కూర్చుని ఉందని స్థానికులు వెల్లడించారు.
NLR: వైసీపీ రాజకీయం చేసి మత్స్యకారులను రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. మత్స్యకారులకు మొదటి నుంచి వైసీపీనే ద్రోహం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం చేశారన్నది అవాస్తవమన్నారు. మత్స్యకారులకు అన్యాయం చేయాలన్న ఆలోచన లేదన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వైసీపీ ఆరాటపడుతుందని స్పష్టం చేశారు.