PLD: నరసరావుపేట అరండల్‌పేటలో డా. దండమూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన సాయి నేత్రాలయం–లేజర్ & ఫాకో సెంటర్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఆసుపత్రులు మరింత అవసరమని పేర్కొన్నారు.
NDL: ఎరువుల దుర్వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో టాస్క్ ఫోర్స్ సమావేశంలో యూరియా పరిశ్రమల వైపు మళ్లకుండా నిఘా పెంచాలని సూచించారు. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు.
కోనసీమ: గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి స్మార్ట్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. మండపేట MPDO కార్యాలయంలో జరిగిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌లకు 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోలసముద్రం గ్రామంలో సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి చోరీల నివారణ, రోడ్డు భద్రత, మహిళలపై నేరాలు, శారీరక దాడులు, భూ వివాదాలపై సూచనలు ఇచ్చారు. సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
పార్వతీపురం పట్టణం కొత్తవలసలో కొత్త పోలమ్మ పండుగ వివాదం రేపుతోంది. ఈనెల 27 నుంచి 29 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా, అమ్మవారిని తమ వీధిలోకి తీసుకురావాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. అయితే, అగ్రవర్ణాలకు చెందిన కమిటీ పెద్దలు ఇందుకు నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాలనీ ప్రజలు నిరసన చేపట్టారు.
ASR: వ్యవసాయ ఆధారిత జిల్లాను మరింత బలోపేతం చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సుగంధ ద్రవ్యాల శాఖల సమన్వయంతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంటలను పండించేలా చూడాలన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. దిగుబడులు పెంచేందుకు రైతులకు శిక్షణలను అందించాలన్నారు.
SKLM: మహిళా సంఘాల ఆర్థిక పురోగతికి వీవోఏలు వెన్నెముక వంటి వారని ఎమ్మెల్యే శిరీష అన్నారు. ఈ మేరకు మంగళవారం పలాస టీడీపీ కార్యాలయంలో 142 వీవోఏలకు ఉచితంగా మొబైల్ ఫోన్లను ఎపంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పొదుపు సంఘాల లావాదేవీలు, రికార్డుల నిర్వహణను ఆన్‌లైన్ ద్వారా వేగవంతం చేసేందుకు ఈ స్మార్ట్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు
కాకినాడ నగరంలో దోమల సమస్యను అరికట్టేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం కొండయ్యపాలెం ప్రాంతంలో నిర్వహించిన ఫాగింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… నగర వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కడప జిల్లాలో మహిళా భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజంపేట CI నాగార్జున ఆధ్వర్యంలో గాలివారిపల్లిలో మహిళలకు ‘శక్తి’ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో SMS ద్వారా 112కు సమాచారం ఇస్తే 10 నిమిషాల్లో పోలీసులు స్పందిస్తారని తెలిపారు.
PLD: కోటప్పకొండలో జూన్ 1 నుంచి 5 వరకు ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కరపత్రాలను నేతలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగ సమస్యలపై యువత పోరాడాలని రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. యువత హక్కులు, సామాజిక అంశాలపై ఈ శిబిరంలో మేధావులతో లోతైన చర్చలు ఉంటాయన్నారు. యువకులు భారీగా తరలిరావాలని కోరారు.
ATP: అనంతపురం నగరంలోని లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్, ఆప్కో మెగా షోరూంలను మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హస్తకళలను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. విక్రయాలు పెంచేలా షోరూంలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయని మంత్రి తెలిపారు.
KRNL: ఓర్వకల్లు మండల కేంద్రంలోని పొదుపు ఐక్య సంఘం భవనంలో మంగళవారం SERP ఆధ్వర్యంలో VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి వీఓఏలకు 5జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. వీటితో గ్రామీణ స్థాయిలో సేవలు మరింత సమర్థంగా అందించాలన్నారు.
AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న రాంబిల్లిలో రెన్యూ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌తో కలిసి సమీక్షించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
సత్యసాయి: గోరంట్ల మండలం చిత్రావతి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, తహసీల్దార్ మధు నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు.
E.G: జలధార – జలహారతి ద్వారా భూగర్భ జలాల స్థాయి పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె జిల్లాలో గుర్తించిన 1,265 చెరువుల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా 411 పనులను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 173 పనులకు ఆమోదం లభించిందని, మిగిలిన పనులపై అధికారులు చొరవ చూపాలని సూచించారు.