KDP: జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రాయలసీమ రీజియన్ హోమ్ గార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ హోంగార్డ్స్ పెరేడ్‌ను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.హోంగార్డుల సేవలు కీలకమని పేర్కొంటూ, ఆరోగ్యం, రోడ్డు భద్రతపై అవగాహన అవసరమని చెప్పారు. దర్బార్‌లో సిబ్బంది సమస్యలు విన్న కమాండెంట్ పరిష్కారానికి హామీ ఇచ్చారు.
NLR: నగర పాలక సంస్థలో కారుణ్య నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ మరణించిన సిద్దికట్టి శ్రీనివాసులు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా, ఆయన కుమారుడు శివకుమార్‌కు ఆయిలర్‌గా ఉద్యోగం కేటాయించారు. ఈ మేరకు కమిషనర్ వై.ఓ. నందన్ ఉత్తర్వులు జారీ చేశారు.
BPT: అంగన్వాడీ కార్యకర్తల సేవలు అభినందనీయమని, బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ నడుం బిగించాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన “కిశోరి వికాసం–2026” వేసవి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ATP: తాగునీటి ఎద్దడి పరిష్కారంపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. రూరల్ ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సత్యసాయి తాగునీటి సరఫరా సంస్థ ఎస్ఈ, స్థానిక నాయకులతో కలిసి చర్చించారు. మండలంలోని గ్రామాలు, నగర శివారు కాలనీలలో నెలకొన్న నీటి ఇబ్బందులను వెంటనే తొలగించాలని ఆమె ఆదేశించారు.
NTR: కంచికచర్లలోని ప్రధాన రహదారిపై శనివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంధన కొరత నేపథ్యంలో డీజిల్ కోసం భారీ వాహనాలు బంకుల వద్ద రహదారిపైనే క్యూ కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.
TPT: వెంకటగిరి నియోజకవర్గంలో VOAలకు సుమారు రూ. 30 లక్షల విలువైన 5G స్మార్ట్ఫోన్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టడంలో VOAలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. 2047 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యమన్నారు.
CTR: కుప్పం డిపోలో డ్రైవర్లు, కండక్టర్లతో APSRTC వైస్ ఛైర్మన్ మునిరత్నం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, మహిళలు, దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. కుప్పంలో రూ. 75 కోట్లతో ఆధునిక ఆర్టీసీ డిపో నిర్మాణం చేపట్టి, భవిష్యత్తులో ఎలక్ట్రిక్, ఏసీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
PLD: పెదకూరపాడులో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశా కార్యకర్తలు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ వలిగొండ రెడ్డి ఆదిత్య మాట్లాడుతూ.. దోమల నివారణకై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల వలన అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను శనివారం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ్యోతి మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆమె సూచించారు.
KRNL: కల్లూరు మండలం పెద్దకొట్టల గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మండల కో-ఆప్షన్ సభ్యుడు హబీబ్‌తో పాటు ఐదు కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి శనివారం టీడీపీలో చేరాయి. MLA గౌరు చరిత రెడ్డి, వెంకట రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు.
W.G: వరల్డ్ మలేరియా డే సందర్భంగా కొనితివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మలేరియా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి యు. నవనీత్ కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమల నివారణ సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో పి. ప్రభాకర్ రావు, కుమార్, వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
KRNL: ఉపాధి హామీ పథకంలో బినామీల జోరు కొనసాగుతుందని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పనయే లక్ష్యంగా అమలవుతున్న వీబీజీఆర్‌జీ పథకం అవినీతిమయంగా తయారైందన్నారు. దీనిపై వైసీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా ఉంటుందన్నారు.
GNTR: దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ స్వయంగా వారి వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించారు. ప్రత్యేక PGRS కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని రంగరాజు వీధికి చెందిన ప్రైవేట్ బస్ డ్రైవర్ సయ్యద్ అన్వర్ హుస్సేన్ ఇటీవల ఇంటి ముందు నిలబడి ఉండగా అదుపుతప్పిన ఆటో ఆయనపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన కాలికి ఫ్రాక్చర్ అయింది. విషయం తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి బీసీజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున శనివారం రూ.10వేల ఆర్థిక సహాయం అందించి, బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.