PLD: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి ఆయన సేవలు మరింత బలోపేతం అవుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. విలువల ఆధారిత రాజకీయాలకు కట్టుబడి ఉన్న నేతగా కన్నాను ప్రశంసిస్తూ, ఈ నియామకంతో కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపబడిందని తెలిపారు.
KKD: కరప జెడ్పీ హైస్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యంత వెనుకబడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదు. బైపీసీలో 18 మందికి కేవలం ఏడుగురే పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలోనూ ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి.
KDP: రాజంపేటలో దివ్యాంగ శక్తి పథకం కింద బస్సు పాసుల పంపిణీ కార్యక్రమాన్ని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నిర్వహించారు. ఒక్కో పాస్‌కు రు.100 చొప్పున 2000 మందికి పైగా దివ్యాంగులకు సొంత నిధులతో చెల్లించి పాసులు అందజేశారు. ఇంటి వద్దకే పత్రాలు సేకరించి పాసులు ఇవ్వడం ద్వారా సమయం, ఖర్చు తగ్గించినట్లు తెలిపారు.
CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్‌తో పాటు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు
NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
PLD: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో సెన్సెస్-2027 రెండో విడత శిక్షణ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ తిరుపతి స్వామి పాల్గొని ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. మొబైల్ యాప్‌ల ద్వారా డేటా సేకరణపై అవగాహన కల్పించారు. కచ్చితమైన గణాంకాలతోనే అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. మొత్తం నాలుగు బ్యాచ్‌లకు గానూ రెండో బ్యాచ్ శిక్షణ పూర్తయింది.
కడప రైల్వే స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం–కడప ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు స్టేషన్ పరిసరాలు, పార్సెల్ సెంటర్లు, ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రగ్స్ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
TPT: తిరుపతి కపిలేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కపిలతీర్థంలో స్నానం చేసి, విఘ్నేశ్వరుడు, కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి దర్శనం చేస్తే శ్రేయస్సు, సంతానం, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. కాలభైరవ స్వామి, కోటిలింగాలు దర్శనం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని తెలిపారు.
సత్యసాయి: బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘మా ఊరు – మన జెండా’ కార్యక్రమంలో భాగంగా కాలనీని సందర్శించిన మంత్రికి ప్రజలు వీధి దీపాలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని హరీష్ బాబుకు సూచించారు.
ATP: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను దారుణంగా కాజేస్తోందని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని కనబరిచిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కొనియాడారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో ఉన్న జిల్లా, ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానానికి చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీపడి జిల్లా టాప్-3లో నిలవడం గొప్ప అన్నారు.
VZM: జిల్లాలో రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసి సకాలంలో అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన పాల్గొన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు.
W.G: సెన్సెస్-2027లో భాగంగా మే 1 నుంచి 30వ తారీకు వరకు ఇండ్ల గణన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఉండి తహసీల్దార్ కె. నాగార్జున బుధవారం తెలిపారు. ఈ నెల 16 వతేది నుంచి ఏప్రిల్ 30వ వరకు స్వీయ గణన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు, కుటుంబ వివరాలను https://se.census.gov.in నమోదు చేసుకోవాలి అన్నారు.
KDP: తాళ్ల ప్రొద్దుటూరు పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సుగుమంచిపల్లి చెక్‌పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి 250 క్వార్టర్ బాటిళ్ల కేరళ మాల్ట్ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. చామలూరు గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి వద్ద నుంచి మద్యం పట్టుబడగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య: రాయచోటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీనియర్ రిపోర్టర్ పూడి శ్రీహరి అరెస్ట్ అప్రజాస్వామికమని పేర్కొంటూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో భారీ వ్యయాలు చేసి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.