AKP: మాజీ ఎమ్మెల్యే, పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు, ఎస్ రాయవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అప్పన్నను పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు విశాఖ వెళుతున్న నేపాధ్యంలో వారిని పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
KRNL: ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో నిన్న దాసరి మహేష్ (33) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో పనుల కోసం తీసుకెళ్లిన ఇనుప నిచ్చెనను తిరిగి తీసుకువస్తుండగా, అది విద్యుత్ తీగలకు తగిలి వెంటనే కుప్పకూలిన మహేష్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సవితను బుధవారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు కూడా ఆమెను కలిసి తమ సమస్యలను విన్నవించారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి, వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ASR: ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, మే ఫేర్ హోటల్స్ యజమాని దిలీప్ కుమార్ రేను జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో శాలువా కప్పి, బొకే అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కూటమి నేతలు జగన్ తదితరులు పాల్గొన్నారు.
SKLM: జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed 3వ సెమిస్టర్ అలాగే B.PEd & D.PEd 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ కావ్య జోష్ణ్న ఈ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆమె సూచించారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో రైతులు, వ్యాపారుల కోసం నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి డైరెక్టర్లతో కలిసి బుధవారం పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పునరుద్ధరించినట్లు ఆమె తెలిపారు. త్వరలో దీనిని ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైతుల సౌకర్యార్థం మరిన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
KDP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ బ్రేక్ సమయంలో ఆయన తన సోదరుడు పుత్తా లక్ష్మారెడ్డి ఇతర స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనను సత్కరించి ఆశీర్వదించారు.
AKP: దేవరాపల్లి మండలానికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రెడ్డి మహేశ్ కుమార్ అనకాపల్లి జిల్లా పోలీస్ వార్షిక క్రీడల్లో ప్రతిభ కనబర్చారు. విశాఖపట్నం కైలాసగిరి సమీప ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్‌లో రెండు బంగారు పథకాలు సాధించారు. కబడ్డీలో కాంస్య పథకం సాధించినట్లు పేర్కొన్నారు.
NLR: కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య పరిస్థితులపై ఎమ్మెల్యే ఇంటూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అనూషతో పాటు సిబ్బందితో సమీక్ష నిర్వహించి, పర్యవేక్షణ లోపాలను ప్రశ్నించారు. కాలువల్లో చెత్త తొలగింపు లేకపోవడం, నిర్లక్ష్యంగా పనులు చేయడంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
NDL: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాహకులు మెనూ తప్పనిసరిగా పాటించాలని మండల విద్యాధికారి న్యామతుల్లా పేర్కొన్నారు. మంగళవారం చాగలమర్రిలోని గుంతపాలెం వీధిలో గల ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.
ATP: ఆత్మకూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 10న మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లక్ష్మీనరసింహ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. మండలంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తప్పక హాజరు కావాలని సూచించారు.
NLR: రానున్న మూడు నెలల్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో, మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో బుధవారం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చెంచురామయ్య పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి బుధవారం ఉదయం సందర్శించారు. ఈ మేరకు ప్రజలతో మాట్లాడి క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శానిటేషన్ సెక్రటరీ సింహాచలం ఉన్నారు.
E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ నేడు, రేపు ముంబయిలో పర్యటించమన్నారు. స్థానిక గ్రాండ్ హయత్ హోటల్‌లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాకు మంత్రి హాజరు కానున్నారు. ముంబయి వేదికగా ఏపీ పర్యాటక రంగంలోని పెట్టుబడి అవకాశాలు తదితర వాటిని వివరించనున్నారు.