CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు, వేదపండితులు, ఇతర ఆలయ సిబ్బంది కూడా హాజరయ్యారు.
ATP: తాడిపత్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని MLA జేసీ అస్మిత్ రెడ్డి CM చంద్రబాబుని కోరారు. యాడికిలో సీఎంను కలిసి ఈ ప్రాంతంలోని చారిత్రక ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని విన్నవించారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం తాడిచర్ల రోడ్డు శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రామును కట్టావాని చెరువు ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఖబరస్థాన్‌కు (బరియల్ గ్రౌండ్) రక్షణగా ప్రహరీ గోడ నిర్మించాలని అబ్దుల్ కరీం, ఫైజు తదితరులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
AKP: సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి కార్మికులకు ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గృహ నిర్మాణ మెటీరియల్ రేట్లను తగ్గించాలన్నారు. రద్దు చేసిన భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలన్నారు.
TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో సోమవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలింతలకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీల దేవి, సివిల్ సర్జన్ డా.రామనారాయణ రెడ్డి పర్యవేక్షణలో సుమారు 190 మంది బాలింతలకు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
GNTR: తెనాలిలో వీడియో గ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వెడ్డింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. సుల్తానాబాద్‌లో నికాన్ కంపెనీ సహకారంతో జరిగిన ఈ ఫ్రీ వెడ్డింగ్ వర్క్ షాప్‌కు ఫ్యాకల్టీగా నికాన్ క్రియేటర్ నాని నరేంద్ర హాజరయ్యారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి ఫోటోగ్రఫీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిందని అన్నారు.
ప్రకాశం: కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు జల వనరుల శాఖ ఆధ్వర్యంలో “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” పేరుతో 100 రోజుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సాగు నీటి సంఘాల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నీటి వినియోగంలో బాధ్యత అవసరమని అధికారులు సూచించగా, సాగు నీటి సంఘాలు సమర్థంగా పని చేయాలన్నారు.
PPM: కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ADP, ABP పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. సంపూర్ణత అభియాన్ 2.0 కింద కీలక సూచికలను 100% సాధించేందుకు మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఆదేశించారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ATP: గ్రామ స్వరాజ్య స్థాపనలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ తాజా మాజీ సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో విశేష కృషి చేశారని ప్రశంసించారు.
కర్నూలు జిల్లా కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరం ఆలయంలో జరిగిన చోరీ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 కిలోల వెండి దొంగిలించగా, 4 కిలోల వెండి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా కేసును ఛేదించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
అనంతపురం కలెక్టర్ కార్యాలయం సమీపంలో సోమవారం మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రాయదుర్గం ప్రాంతానికి చెందిన రాముడు విద్యుత్ స్తంభానికి ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు రాఘవేంద్ర సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, బాధితుడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తరలించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 9వ వార్డు శాంతినగర్లో గుడిపల్లి కాలువ పూడిక నిండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన, దోమలతో సతమతమవుతున్నామని వాపోయారు. సమస్యను స్థానిక కౌన్సిలర్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన సొంత నిధులతో కాలువలో పూడిక తీత పనులు చేయించారు.
CTR: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి సూచించారు. అధిక లాభాల పేరుతో సోషల్ మీడియా ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు.
PLD: పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అనుబంధ ఆసుపత్రి ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభం కానుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.