అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఎం.ఎస్ నెం. 43ను విడుదల చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. జర్నలిస్టులు రూ.1,250 ప్రీమియం చెల్లించగా, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని భరిస్తుంది. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించనుంది.
KDP: వల్లూరు(M)లోని పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. తొలిరోజు బుధవారం రాత్రి అంకురార్పణ సందర్భంగా దేవస్థానంలో విష్వక్సేన ఆరాధన, వాస్తు పూజ, మేదిని పూజ, అఖండ దీపారాధన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త, కార్యనిర్వహణాధికారి, అర్చకులు పాల్గొన్నారు.
GNTR: ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కె.భుజంగరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచే విధంగా పనిచేస్తానన్నారు. ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.
KRNL: ఆదోనిలోని శ్రీనివాస్ భవన్ ముందు ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఇవాళ ఉదయం పరిశీలించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న అల్పాహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఆహారం నాణ్యత, వడ్డింపు విధానం వంటి అంశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
E.G: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని గోపాలపురం టీడీపీ రైతు విభాగ అధ్యక్షుడు అబ్బిన సురేంద్ర తెలిపారు. గత వైసీపీ పాలనలో ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో ఆలస్యం జరిగేదని, ప్రస్తుతం ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
KRNL: ఆదోనిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవం మే మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జాతరకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను గురువారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. రథోత్సవం జరిగే మార్గంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా పనులు పూర్తి చేయాలన్నారు.
SKLM: మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆస్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. రీ వెరిఫికేషన్‌కు సైతం 20వ తేదీ నుంచి 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
E.G: ఆర్యాపురం సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా గురువారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. సీతంపేట, టీచర్స్ కాలనీ, ఈఎస్ఐ ఆస్పత్రి, కృష్ణనగర్, కొత్త రోడ్డు, స్వతంత్ర ఆస్పత్రి ప్రాంతాలు ప్రభావితమవుతాయి. పనులు పూర్తయ్యాక సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.
KKD: పిఠాపురం పురపాలక సంఘానికి పదోన్నతి లభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. Dy. CM పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో సెకండరీ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పిఠాపురం అప్‌గ్రేడ్ అయింది. ఈ హోదాతో పట్టణ అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు కానున్నాయి. పవన్ కృషి పట్ల జనసేన నాయకులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ELR: జిల్లాలో భవన నిర్మాణ రంగ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. భీమా పథకంలో నమోదైన కార్మికులకు వివాహ కానుక పథకం కింద రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 18-60 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులన్నారు.
ATP: అనంతపురం పట్టణ అభివృద్ధి సంస్థ (అహుడా) పరిధిలో అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆనంద్, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ చర్చించారు. నగరంలో పింక్ టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టుల గురించి చైర్మన్ కలెక్టర్‌కు వివరించారు. అహుడా అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని, అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
KRNL: మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొలేరో డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగిందని వారు వివరించారు. నిద్ర మత్తులో కుడి సైడ్ వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లు వెల్లడించారు. సదరు వాహనానికి పర్మిట్ లేదన్నారు.
W.G: పాలకొల్లు పట్టణం క్రిస్టియన్ పేటకు చెందిన వరుడు చందక సాయికుమార్‌పై దాడికి పాల్పడిన గోగులమండ శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న వధువు ఇంటి వద్ద జరిగిన రిసెప్షన్ వేడుకలో శ్రీను తనపై కత్తితో దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
కర్నూలులోని ఓ థియేటర్‌లో జరిగిన వీరశైవుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం మాట్లాడారు. వీరశైవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. వారిని ఓబీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంటులో చర్చిస్తానన్నారు. అనంతరం ఆయన బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం: పొదిలి మండలం తూర్పు పాలెంలో దుండగుడు ఓ ఇంట్లోకి చొరబడి మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై రాజేష్ దర్యాప్తు చేపట్టారు. సమీప సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు నిందుతుడు ఫిరోజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.