GNTR: చేబ్రోలు (మం) పాతరెడ్డిపాలెంలో పంట కాలువ పూడికతీత పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. రూ.8 లక్షలతో ఈ పనులు చేపట్టారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. కాలువల ఆధునీకరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు. రైతుల ఇబ్బందులు తొలగించేలా ఈ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
WG: పోటీ ప్రపంచంలో విద్యతోపాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా ముఖ్యమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఆకివీడు మండలం దుంపగడప వివి గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని వక్తలు పిలుపునిచ్చారు.
ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి. ముని రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుదీర్ఘకాలం పాటు శాఖకు విశిష్ట సేవలు అందించిన మర్రి సత్యనారాయణ (RSI), కె. ఆంజనేయులు (ARSI), మరియు ఎమ్. అర్లప్ప (HC) కు పోలీసు కోపరేటివ్ సొసైటీ పొదుపు చెక్కులను అందించారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలం కేశవాపురం సమీపంలో ఉపాధి హామీ పనుల్లో కళావతి అనే కూలిపై అడవిపంది దాడి చేసింది. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఉపాధి హామీ ఏపీవో గాయపడిన కూలిని పరామర్శించారు. అడవిపందుల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ప్రతి సమస్యను వివరంగా అర్థం చేసుకుని, సంబంధిత అధికారులకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రజల కోసమే. వారి బాధలు తీర్చడం మా ప్రధాన బాధ్యత అని ఆమె అన్నారు.
SKLM: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రత్యేక ఆహ్వానం మేరకు శనివారం ఎచ్చెర్లలో మంత్రి పర్యటించారు. ఈ మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరుగుతున్న మోదీ కప్ క్రికెట్ టోర్నమెంటును సందర్శించారు. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
VZM: గజపతినగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలను ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌కు మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు వినతి పత్రాన్ని అందజేశారు. వంద పడకల ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు కూర్చోవడానికి కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
అన్నమయ్య: సుండుపల్లెలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరి ప్రసాద్, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అభివృద్ధి పనులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ATP: ఆపదలో అత్యవసర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం రాయదుర్గంలో 24 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 387 మందికి రూ.2.58 కోట్ల సహాయం అందిందని తెలిపారు.
SS: తెలంగాణలో కొందరు విశ్లేషకులు వైసీపీ ట్రాప్‌లో ఉండి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపాలని చూడటం సరైన పద్ధతి కాదని ధర్మవరం జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దేశ నాయకుడని, తెలుగు ప్రజల శ్రేయస్సే ఆయన ధ్యేయమన్నారు. కొందరు వైసీపీ కోవర్టులుగా మారి పవన్ కళ్యాణ్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
ATP: జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో జిల్లాలో ట్రాక్టర్ బాడుగలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో గంటకు రూ. 900 లుగా ఉన్న టిల్లర్ బాడుగను ప్రస్తుతం రూ. 1000 కి పెంచారు. ట్రాక్టర్ యజమానులు రకాన్ని బట్టి గంటకు రూ.100 నుంచి రూ. 200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
GNTR: మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో సాగుతున్న ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పనులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. MTMC కమిషనర్ ఆలీమ్ బాషా ఆధ్వర్యంలో జేసీబీలతో ఈ పూడికతీత పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం లోపు డ్రైనేజీల్లో మట్టిని తొలగించి, మురుగునీరు సాఫీగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు.
KRNL: ఆదోని మండల పరిధిలో జరగాల్సిన ఒక బాల్య వివాహాన్ని శక్తి బృందం అడ్డుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, శిశు సంక్షేమ, పోలీసు, సచివాలయ సిబ్బంది కలిసి విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల సభ్యులను పెద్దతుంబలం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇవాళ ఎస్ఐ విద్యాశ్రీ, సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల అనర్థాలను వివరించి, చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. వైద్య చికిత్సలు, అత్యవసరాల కోసం, ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని అర్హులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఊరటనీస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కోనసీమ: జనగణన ప్రక్రియకు శనివారం చివరి రోజు కావున ప్రజలందరూ ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని రావులపాలెం ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం కోరారు. ప్రజలు అందించే వివరాల ఆధారంగానే దేశ ఆర్థిక ప్రణాళికలు రూపొందించబడతాయని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు గ్రాంట్లు మంజూరు అవుతాయని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ క్లస్టర్లలో 100 శాతం పూర్తి చేయాలన్నారు.