తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని ఇటీవల భారత రాష్ట్ర సమితిగా(BRS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈసీ ఆమోదం లభించడంతో, BRSను లాంఛనంగా ప్రారంభించారు. కర్నాటక సహా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ విషయం పక్కన పెడితే, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పోటీపై జోరుగా చర్చ సాగుతోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ వాళ్లను ఇష్టారీతిన తిట్టిన కేసీఆర్, ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఎలా వస్తారనే చర్చ సాగుతోంది. గతంలో తిట్టిన వాటిని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని అంటున్నారు. ఈ చర్చ సాగుతుండగానే, ఇటీవల విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలో కక్ష రాజకీయాలకు సెలవు అని ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
కక్ష రాజకీయాలకు సెలవు అని భారత రాష్ట్ర సమితితో విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేసినవో తెలియదని, అది ఎవరికి వర్తిస్తుందో బీఆర్ఎస్ పార్టీ వారినే అడగాలని సజ్జల అన్నారు. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చునని, ఒకవేళ కేసీఆర్ మద్దతు కోరితే, తమ అధినేత జగన్.. పార్టీలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇతర పార్టీల సహకారం తీసుకొని ఇక్కడ ఏదో చేయాలని లేదా పొత్తులు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. తమకు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే ఆలోచన లేదన్నారు.