»Ysr La Nestham Funds Released Cash In 2677 Peoples Accounts
Andhrapradesh: ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల.. 2,677 మంది ఖాతాల్లోకి నగదు
యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ సర్కార్ 'వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్'ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొదటి విడత నిధులను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
ఏపీ సర్కార్ యువ న్యాయవాదులకు(Lawyers) గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి విడత ‘వైఎస్ఆర్ లా నేస్తం’ స్కీమ్(YSR Law Nestam Scheme) కింద ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. సీఎం జగన్(CM Jagan) తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఈ నిధులను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన 2,677 మంది ఖాతాల్లో నగదును జమ చేశారు. ప్రతి వ్యక్తికీ కూడా రూ.25 వేల లెక్కన మొత్తంగా రూ.6,12,65,000లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చే యువ న్యాయవాదులకు(Lawyers) అండగా ఉండేందుకు ఏపీ సర్కార్ ‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకాన్ని(YSR Law Nestam Scheme) తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇవ్వనన్నట్లు సీఎం జగన్(Cm Jagan) ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అంటే మూడేళ్లకు గాను ప్రతి ఒక్కరికి రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు వైఎస్ఆర్ లా నేస్తం పథకం(YSR Law Nestam Scheme) కింద 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లను ఏపీ సర్కార్ అందజేసింది. ఆర్థిక సాయం కోసం యువ న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా లేదంటే నేరుగా లా సెక్రటరీకి గానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులుంటే 1902 నెంబర్కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని ఏపీ సర్కార్ వెల్లడించింది.