Profile: సిద్దార్థ లూథ్రా ఎవరు..? ఆయన నేపథ్యం ఏంటీ..?
సిద్దార్థ లూథ్రా.. ఫేమస్ క్రిమినల్ లాయర్. రోజుకు రూ.కోటిన్నర ఫీజుగా తీసుకునే ఈ లాయర్ దేశంలో కాస్ట్లీ వకీల్. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.
Siddhartha Luthra: ఇప్పుడు వినిపిస్తోన్న పేరు సిద్ధార్థ లూథ్రా.. ఈయన ఎవరు..? ఇంతకుముందు ఏ కేసులు వాదించారు.. అందులో సక్సెస్ రేటు ఎంత..? స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబును బయటకు తీసుకొస్తారా అనే ప్రశ్నలు తెలుగు తమ్ముళ్ల మెదళ్లను తొలచివేస్తున్నాయ్. సిద్ధార్థ లూథ్రా ఫేమస్ క్రిమినల్ లాయర్. పరిష్కారం కానీ, చిక్కుముడుల కేసులను వాదించి శభాష్ అనిపించుకున్నారు. అందుకే చంద్రబాబు కేసును వాదించేందుకు లూథ్రాను టీడీపీ నియమించింది. ఇప్పుడే కాదు గతంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి తెలంగాణ హైకోర్టులో కేసు నడిచింది. ఆ కేసును కూడా లూథ్రా వాదించారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంలో లూథ్రా వాదనల ప్రభావం ఉంది. ఆ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ అధికారులకు హై కోర్టు ఆదేశాలు జారీచేసింది.
తండ్రి కూడా లాయరే
సిద్ధార్థ లూథ్రా 1966 ఫిబ్రవరి 16వ తేదీన ఢిల్లీలో కేకే లూథ్రా దంపతులకు జన్మించారు. కేకే లూథ్రా కూడా అడ్వకేట్, అలాగే అతని సోదరి గీతా లూథ్రా కూడా న్యాయవాదే కావడం విశేషం. ఢిల్లీ ఆర్కే పురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హై స్కూల్ విద్య పూర్తయ్యింది. 1987లో హిందూ కాలేజీలో బీఏ మ్యాథమేటిక్స్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో 1990లో లా చేశారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. కేంబ్రిడ్జీ వర్సిటీలో క్రిమినాలజీలో ఎంఫిల్ పూర్తి చేశారు. 1991లో బేసిన్ అండ్ కో పేరుతో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1993లో తండ్రి వద్ద కూడా వర్క్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో 1996-97 మధ్య పాఠాలు బోధించారు. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా లా స్టూడెంట్లకు పాఠాలను బోధించారు. యూకే న్యూకాజిల్‌లో గల నార్తంబ్రియా వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెషర్‌గా పనిచేశారు. 1997లో లూథ్రా తండ్రి చనిపోయాడు. తర్వాత సీనియర్ లాయర్ పీఆర్ వాల్కీ నేతృత్వంలో క్రిమినల్ లా ప్రాక్టీస్ చేశారు. అలా క్రిమినల్ కేసులను వాదిస్తూ.. మంచి పేరు గడించారు. న్యాయవాద వృత్తిలో అతను అందించిన సేవలను గుర్తిస్తూ 2015లో అమితీ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
స్పెషలిస్ట్
క్రిమినల్ కేసులు, వైట్ కాలర్ కేసులు, సైబర్ ఫ్రాడ్ కేసులను వాదించి, బాధితులకు న్యాయం చేశారు లూథ్రా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. ఆ కేసులో జైట్లీ తరఫున లూథ్రా వాదనలు వినిపించారు. 2002లో సంచలనం రేపిన తెహల్కా కేసులో కూడా వాదించారు. ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేరుతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జస్టిస్ వెంకటస్వామి కమిషన్‌లో సభ్యుడిగా ఉండి.. అప్పటి రక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. జస్టిస్ సౌమిత్ర సేన్ కేసు విచారణ కమిటీలో కూడా భాగస్వాములు అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) నిబంధన బీ నుంచి ఆర్టికల్ 217 (1) ప్రకారం జస్టిస్ సేన్ తప్పుగా ప్రవర్తించారని కమిటీ నిర్ధారించింది. ఆ కమిటీలో లూథ్రా కీ రోల్ పోషించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం రేపింది.
ఫేస్బుక్ తరఫున
21 సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు.. ఫేస్ బుక్, గూగుల్, యాహులపై జర్నలిస్ట్ వినయ్ రాయ్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఆ కేసులో ఫేస్ బుక్ తరఫున లూథ్రా వాదనలు వినిపించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి ఇద్దరు విద్యార్థులు ఢిల్లీ హైకోర్టులో 2016 సెప్టెంబర్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సిద్దార్థ లూథ్రా వాట్సాప్ తరఫున వాదించారు. అప్పట్లో దేశంలో సంచలనం రేకెత్తించిన నిర్భయ కేసులో కూడా లూథ్రా పాత్ర ఉంది. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో లూథ్రా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2013లోనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించింది. దానిని 2017 మే 5వ తేదీన సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
ఫీజు ఎంతంటే..?
న్యాయస్థానం ప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ లూథ్రా. 2012 జూలైలో అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమించారు. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ లా, విధానపర నిర్ణయాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించారు. 2014 మే నెలలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ పదవీకి రాజీనామా చేశారు. లూథ్రా ఫేమస్ లాయర్ కావడంతో క్రిమినల్ కేసులకు ఎక్కువే ఛార్జీ చేస్తారు. రోజుకు రూ.1.50 కోటి ఫీజు తీసుకుంటారని తెలిసింది. అలాగే స్పెషల్ ఫ్లైట్, లగ్జరీ కారు, స్టార్ హోటల్లో బసకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
భూముల కేసు కూడా
అమరావతి భూముల కేసును కూడా లూథ్రానే వాధిస్తున్నారు. చంద్రబాబుకు సంబంధించి అన్నీ కేసులను లూథ్రా చూసుకుంటున్నారు. వివేకాంద రెడ్డి హత్య కేసులో సునీత తరఫున వాదనలు వినిపించింది కూడా లూథ్రానే. చంద్రబాబుపై వచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ అభియోగాల కేసును కూడా వాదిస్తున్నారు. అందులో మాజీ సీఎంను అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం.. అలాగే ఏ37ను ఎలా అరెస్ట్ చేస్తారు లాంటి కీలక ప్రశ్నలు వేశారని తెలిసింది.