Lakshmi Parvathi: సిమెన్స్ కంపెనీ అవకతవకలకు సంబంధించి మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు రిమాండ్ కూడా విధించింది. బెయిల్ కోసం చంద్రబాబు తరఫు లాయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ రెండో భార్య, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) మాత్రం సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు చేసిన పాపం పండిందని అంటున్నారు. అందుకే ఈ వయస్సులో కష్టాలు అనుభవించక తప్పడం లేదన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) నివాళి అర్పించారు.
చంద్రబాబు అవినీతి పరుడునే సంగతి ఏసీబీ కోర్టు తీర్పుతో ప్రజలకు తెలిసిందన్నారు. తప్పు చేసి.. తానేం చేయలేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను 74వ ఏట చంద్రబాబు నాయుడు అవమానించాడని గుర్తుచేశారు. ఆ క్షోభతోనే మరణించారని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు 74వ ఏట చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తోందని వివరించారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ను టార్చర్ చేసి.. ఇప్పుడు పాపం అనుభవిస్తున్నారని వివరించారు.
ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. కానీ లక్ష్మీ పార్వతికి మాత్రం ఆహ్వానం అందలేదు. ఎన్టీఆర్ భార్యను అని.. ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి భవన్ నుంచి స్పందన రాలేదు.