తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రెండురోజుల క్రితం కలుసుకోవడంపై వైసీపీ నాయకుల విమర్శలు, ప్రశ్నలు ఆగటం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా, విడదల రజని… ఇలా వరుసపెట్టి సెటైర్లు వేస్తున్నారు. గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబును కలవడం విడ్డూరంగా ఉందని విడదల రజని నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, ఎంపీ మిథున్ రెడ్డి వారికి మరో ప్రశ్న వేశారు.
అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేశారని, ఆయన మళ్లీ సీఎం కావాలని చూస్తున్నారని, మరోవైపు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ చెబుతున్నారని, అంటే ఇద్దరు సీఎం అభ్యర్థులు జతకట్టడం అంటే సిద్ధాంతాలు లేకపోవడమేనని ఎద్దేవా చేశారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం చంద్రబాబు ఎత్తు వేస్తున్నారని, పవన్ కళ్యాణ్ తీరు, ఆయన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు.
పవన్ షోలతో చంద్రబాబుకు జనం ఓట్లు వేయరన్నారు. రాజకీయం వేరు, సినిమా వేరు అని, కాపుల ఓట్ల కోసం చంద్రబాబు జనసేనాని వలను విసురుతున్నారని, ఇది అందరికీ అర్థమైందన్నారు. వారిద్దరు జతకట్టి, కాపుల ఓట్ల కోసం డ్రామాలు ఆడి అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ ఒక్కటైనా కూడా వారికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. చట్టాలను గౌరవించలేని చంద్రబాబు ఎలా పాలన చేస్తారన్నారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై జీవో చదువుకోవాలని సూచించారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఈవెంట్లు అనుమతి పొంది నిర్వహించారని గుర్తు చేశారు.