విభజన సమయంలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడటానికి జగన్ కి అంత భయం ఎందుకు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన సంగతి పక్కన పెడితే…. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిందని… అది ఎవరి ప్రయోజనాల కోసం చేసిందని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ కు సత్సంబంధాలు ఉండవచ్చని, అందులో తప్పు లేదని, అయితే న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై వెనక్కి తగ్గకూడదని ఉండవల్లి హితవు పలికారు. ఇప్పటికే జగన్ అనేక విషయాల్లో రాజీ పడినట్లు అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోరాటం చేసి జగన్ సిఎం అయ్యారని, ఇప్పుడు మాత్రం జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని అన్నారు.
ఏపీకి అన్యాయంపై సీఎం జగన్ పోరాటం చేయాలని, పోరాటం చేయకుంటే జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని ఆయన అన్నారు. ఎపికి అన్యాయంపై పోరాటం చేయకపోవడం చంద్రబాబుకు 23 సీట్లు రావడానికి ఒక కారణం అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న తది విచారణ జరగనుందని ఆ రోజుకైనా ఏపీ ప్రభుత్వం అన్యాయం వివరిస్తూ అఫిడవిట్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక అమరావతిపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అదేరోజు ఏపీ విభజన అంశాలపై చర్చ జరిగిందని, కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విచారణ జరుగుతుండగా ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది హాజరై తాము విభజనకు వ్యతిరేకం కాదని చెప్పారని, దీనిపై విచారిస్తే పండోరా బాక్స్ ను ఓపెన్ చేసినట్లవుతుందని అన్నారు. ఇది జగన్ కు తెలిసే జరుగుతుందా? నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటున్నారా? అన్నది తేలాల్సి ఉందన్నారు. తెలిసి జరిగితే జగన్ ఆంధ్రప్రదేశ్ కు మోసం చేస్తున్నట్లేనని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.