Visakha MP: కిడ్నాపర్లు దారుణంగా హింసించారు..సీబీఐ విచారణ చేయాలని ఎంపీ ఎంవీవీ డిమాండ్
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. తన కుటుంబాన్ని కిడ్నాపర్లు దారుణంగా హింసించినట్లు తెలిపారు. క్రూరంగా ఇబ్బంది పెట్టి తమ నుంచి డబ్బులు లాక్కున్నారని, ఆ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఏపీ(AP)లో పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. తాజాగా ఏపీ రాజకీయాల్లో(AP Politics) విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(Visakha MP MVV Satyanarayana) ఇంట్లో కిడ్నాప్ ఎపిసోడ్ ఇంకా ట్రెండింగ్లో కొనసాగుతోంది. ప్రతిపక్షాలు దీనిపై సీబీఐ(CBI) విచారణ చేయాలని డిమాండ్ చేయగా దానికి ఎంవీవీ కూడా ఓకే అన్నారు. తాజాగా ఆయన ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ..పోలీసులు చెప్పే వరకూ తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లు తెలియలేదన్నారు.
జూన్ 12వ తేది తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించారని అన్నారు. డబ్బులు వసూలు చేశారని, మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో హేమంత్(Hemanth) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ఏ2గా ఉన్న రాజేష్ పై 40కి పైగా కేసులున్నట్లు తెలిపారు.
హేమంత్(Hemanth)తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(Visakha MP MVV Satyanarayana) అన్నారు. విశాఖలో రక్షణ లేదని కొందరు అనడం సరికాదని, కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. చిన్న చిన్న సంఘటనలు ఎక్కడైనా జరగడం సహజమేనని, ఈ కేసును సీబీఐకు మళ్లించాలని ఎంపీ ఎంవీవీ డిమాండ్ చేశారు.