ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి చేరిన వ్యక్తి కాదు. ముందు నుంచే వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులోనూ.. విజయసాయి రెడ్డి భాగం పంచుకున్నాడు. అలాంటి వీరి మధ్య చెడిందని కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ తో ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని..అందుకే.. తనకంటూ సొంతంగా ఓ మీడియా ఛానెల్ పెడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
దీనికి కారణం కూడా లేకపోలేదు. గత కొంతకాలంగా విజయసాయి రెడ్డిపై ఎలాంటి విమర్శలు వచ్చినా జగన్ పట్టించుకోవడం లేదట. అన్ని పార్టీ విషయాలకు కూడా దూరం పెడుతూ వస్తున్నాడట. దీంతో… ఆవేదనకు గురైన విజయసాయిరెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తుండటం విశేషం.
తనపై అవినీతి ఆరోపణలు వస్తున్నా సాక్షి పత్రిక, ఛానల్ నుంచి ఆ వార్తలకు ధీటుగా కౌంటర్ రాకపోవడం విజయసాయిరెడ్డిని మరింత బాధపెట్టిందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీలో తనకు ప్రాధాన్యత మరింత తగ్గే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి భావిస్తున్నారని బోగట్టా. కొత్త ఛానల్, కొత్త పేపర్ దిశగా విజయసాయిరెడ్డి అడుగులు వేయడం వెనుక అసలు కథ ఇదేనని సమాచారం అందుతోంది.
అదే సమయంలో విశాఖలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మినహా మరేదీ లేదని చెప్పిన విజయసాయిరెడ్డికి ఛానల్ పెట్టే రేంజ్ లో డబ్బు ఎక్కడిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న కామెంట్ల గురించి జగన్ లేదా విజయసాయిరెడ్డి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. విజయసాయిరెడ్డి జగన్ కు వ్యతిరేకంగా మారితే జగన్ కు కొంతమేర నష్టం తప్పదని చెప్పవచ్చు.
కొత్త పత్రిక, కొత్త ఛానెల్ ఎంట్రీ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో సక్సెస్ కావడం తేలిక కాదు. ఈ విషయాలను సైతం విజయసాయిరెడ్డి గుర్తించాల్సి ఉంది. విజయసాయిరెడ్డి కొత్త ఛానల్ ప్రకటన వైసీపీ వర్గాల్లోనే హాట్ టాపిక్ అయింది. మరి నిజంగానే సాయిరెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.