తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పోటు కార్మికులకు రూ.10 వేలు వేతనాలు పెంచనున్నట్లు తెలిపింది. శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు అదనంగా కోటి రూపాయల ప్యాకేజీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తిరుమలకు ఫిబ్రవరిలో దేశాది పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. డిసెంబర్ 28వ తేదీన టీటీడీ ఉద్యోగుల్లో 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచనున్నట్లు తెలిపింది.
తిరుపతిలో పాత సత్రాలు తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు టీటీడీ పాలక మండలి ఏర్పాట్లు చేపట్టింది. జార్ఖండ్ రాష్ట్రంలో టీటీడీ ఆలయాన్ని 100 ఎకరాల్లో నిర్మించాలని తీర్మానించింది. చంద్రగిరిలో మూలస్థాన ఎల్లమ్మ ఆలయానికి రెండు కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300ల ప్రత్యేక దర్శనాన్ని కల్పించనున్నట్లు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.