»Today The Hearing On Skill Case Cid Petition Not To Grant Bail To Gupta
Skill Case: నేడు స్కిల్ కేసుపై విచారణ..గుప్తాకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ పిటిషన్
నేడు స్కిల్ స్కామ్ కేసుపై విచారణ జరగనుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. అలాగే స్కిల్ కేసులో ఏ22, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా ఉన్న యోగేష్ గుప్తాకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కూడా నేడు విచారణ జరగనుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Developement scam Case) టీడీపీ అధినేత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబు (Chandrababu) తరపు న్యాయవాదులు తమ వాదనలను ఇప్పటికే ముగించారు. ఏపీ హైకోర్టు (Ap HighCourt)లో నిన్న ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణ జరిగింది. విచారణలో సీఐడీ (CID) తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా సమయం సరిపోలేదు. దీంతో ఆ విచారణను ఈ రోజు మధ్యాహ్నానికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
బాబుపై ఏపీ సీఐడీ 8 కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందులో స్కిల్ స్కామ్ కేసు కూడా ఒకటి. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో బాబు 53 రోజుల పాటు ఉన్నారు. అయితే కంటి ఆపరేషన్ కోసం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కోర్టు ఆయనకు నాలుగు వారాల వెసులుబాటును ఇచ్చింది. ఆ బెయిల్ గడువు ఈ నెల 28వ తేదితో ముగియనుంది.
ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో యోగేష్ గుప్తా (Yogesh Gupta) ముందస్తు బెయిల్‌పై విచారణ కూడా నేడే జరగనుంది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌లో యోగేష్ గుప్తా కీలకంగా వ్యవహించినట్లు పలు ఆరోపణలున్నాయి. స్కిల్ కేసులో గుప్తా ఏ22గా ఉన్నారు. అయితే గుప్తాకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా గుప్తా పేరును చేర్చినట్లుగా సీఐడీ అధికారులు తెలిపారు.
ఐఆర్ఆర్ (IRR), ఫైబర్ గ్రిడ్ కేసు (Fibergrid case)లో గుప్తా కీలక వ్యక్తి అని, రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతి జరిగిందని, ఆ నల్లధనాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ షెల్ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్ గుప్తా పాత్ర కీలకంగా ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ కూడా నేడు సాగనుంది.