తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అవసరం ప్రజలకు ఉన్నందుకే ఆనాడు అలిపిరి దాడిలో వేంకటేశ్వర స్వామి తనను కాపాడాడని చంద్రబాబు అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తననెవరూ అడ్డుకోలేదన్నారు. తన పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో(Punganur) హింసాత్మక ఘటనలు జరగడంపై ఆయన వైసీపీ నేతలు, పోలీసులపై నిప్పులు చెరిగారు.
ప్రజలంతా సైకో అని అంటున్నారని, కొందరు పోలీసులు కూడా సైకోలుగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కోకాపేట భూములకు మాదిరిగానే ఏపీలో కూడా చేద్దామనుకున్నానని, అయితే తాను తెచ్చిన పరిశ్రమ నుంచి ఎమ్మెల్యే బియ్యపు మధు కమీషన్లు తెచ్చుకుని జేబులు నింపుకుంటున్నాడని అన్నారు. తెలంగాణతో సమానంగా రాష్ట్రాన్ని తయారు చేయాలనుకున్నానని, కానీ వైసీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయన్నారు.
వైఎస్ వివేకానంద లాగా గొడ్డలి వేటుకు చనిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పుంగనూరులోకి వెళ్లకుండానే డీఐజీ వెళ్లినట్లు చెబుతున్నారని, ఆయనకు బుద్ది జ్ఞానం ఉందా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలో సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, నేను సైకిల్ స్పీడ్ పెంచితే ఈ బియ్యపు మధు నూకలు అవుతాడని అన్నారు. కురుక్షేత్ర యుద్ధం మొదలైందని, తాను ఎవ్వరినీ వదిలిపెట్టనని ఫైర్ అయ్యారు.