లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తన ప్రియుడి కోసం కానిస్టేబుల్ రమేష్‌ను ఆయన భార్య హత్య చేసింది. ఈ కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. నిందితురాలు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ పేరు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రియుడు రామారావుతో శివాని కలవడానికి పైడమ్మే కారణమని విచారణలో తేలింది.
పోలీసులు ఈ కేసులో ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. శివాని తన ప్రియుడు రామారావుతో వందల సార్లు కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. రామారావు, పైడమ్మతో కలిసి శివాని బయటకు వెళ్లేదని వెల్లడించింది. పైడమ్మ సహకారంతోనే తన ప్రియుడ్ని తరచూ కలుస్తూ ఉండేదాన్నని విచారణలో శివాని ఒప్పుకుంది. దీంతో ఈ కేసులో ఏ4గా పైడమ్మ పేరు నమోదయ్యే అవకాశం ఉంది.
పైడమ్మ మాత్రం తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. శివాని, రామారావుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తనను ఇరికిస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. రామారావు తనకు ఒక ఫ్రెండ్ మాత్రమేనని, అతన్ని శివానియే తనకు పరిచయం చేసినట్లు చెప్పింది.
ఈ కేసులో ఏ1గా శివాని, ఏ2 రామారావు, ఏ3 నీలా ఉన్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి మత్తులో ఉండగా దిండుతో నొక్కి భర్తను శివాని చంపింది. ఆ తర్వాత తన భర్తకు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. పోస్టుమార్టంలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శివానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.