టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఆయన భార్య భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి రాజమండ్రి జైలులో ములాఖత్ అయ్యారు. కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమన్న చంద్రబాబును ప్రభుత్వం జైలులో పెట్టిందని ఆయన భార్య భువనేశ్వరి (Bhuvaneshwari) ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను జైలులో చూసి బయటకు వస్తుంటే తన భాగాన్ని వదిలేసి వచ్చినంత బాధ కలిగిందన్నారు. జీవితమంతా ప్రజలకే అంకిత మిచ్చిన బాబుకు ఇప్పుడు వారు అండగా ఉండాలని కోరారు. ఇది తమ కుటుంబానికి కష్ట సమయమన్న భువనేశ్వరి, జైలులోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబుతో మాట్లాడేందుకు 45 నిమిషాల పాటు సమయం ఇచ్చారు అధికారులు. ఆయన యోగక్షేమాల గురించి కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఏసీబీ కోర్టు(ACB Court)లో వాదనలు, హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పు, సోమవారం జరిగిన బంద్ ఇతరత్రా అంశాలపై లోకేశ్(Lokesh)ను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజమహేంద్రవరం (Rajamahendravaram) సెంట్రల్ జైలు వద్ద భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.