CM Jagan Illegal Assets Case : జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రయిల్ ఎందుకు ఆలస్యం అవుతోందో తెలపాలని సీబీఐని(CBI) ఆదేశించింది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. జగన్(JAGAN) సీఎం అయిన కారణంగా కేసు విచారణలో జాప్యం జరగకూడదని తెలిపింది. రాజకీయ కారణాల వల్ల ట్రయిల్ ఆలస్యం కాకూడదని వ్యాఖ్యానించింది.
ఈ విషయమై సీబీఐ సుప్రీంకు తమ వైపు కారణాలను తెలిపే ప్రయత్నం చేసింది. ట్రయిల్ సవ్యంగానే జరుగుతోందని తెలిపింది. అయితే అఫిడవిట్ ఇప్పటి వరకు ఎందుకు ఫైల్ చేయలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. అందుకు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘ కాలం పాటు ట్రయిల్ కొనసాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు ఇవ్వకూడదని సుప్రీం అభిప్రాయపడింది.
ఇలాంటి కీలకమైన విషయాల్లో విచారణ జరుపుతున్న కోర్టులే ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జగన్ అక్రమాస్తుల కేసు(JAGAN ILLEGAL ASSETS CASE) ట్రయిల్ త్వరితగతిన జరిగేందుకు అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని కోరింది. బెయిల్ రద్దు, హైదరాబాద్ నుంచి ట్రయిల్ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభం అయ్యే వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.