»Seva Murthy Girijadevi Who Sold Her Properties To Provide Education To Poor Students
Dr. BR Ambedkar Konaseema: పేద విద్యార్థుల కోసం ఆస్తులే అమ్మిన సేవామూర్తి
పేద విద్యార్థుల చదువు కోసం ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మి సేవామూర్తి గిరిజాదేవి సమాజ సేవ చేస్తున్నారు. విద్యార్థులకు సాయం చేస్తే అది వారికే కాదు రేపటి సమాజం కోసం అని బలంగా నమ్మే నిరాడంబరమూర్తి గిరిజాదేవి.
Seva Murthy Girijadevi who sold her properties to provide education to poor students
ఏది అడిగినా లేదనక దానం చేసేవాడు కర్ణుడు అని మనం పురాణాల్లో చదువుకున్నాం. అందుకే అతన్ని దానకర్ణుడిగా అభివర్ణిస్తారు. మరీ అంతటీ సేవానిరితీ(Service), దానగుణం(charity) ఈ కాలంలో ఉన్నాయా అంటే దానికి సాక్ష్యంగా నిలుస్తుంది గిరిజాదేవి(Girijadevi). విద్యార్ధుల చదువుకు పేదరికం అడ్డం కాకూడదని కనీస వసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రాణిస్తారని బలంగా నమ్ముతారు గిరిజాదేవి. అందుకే విద్యాభివృద్ధి(Educational development) కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గిరిజాదేవిది ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (Dr. BR Ambedkar Konaseema) జిల్లాలోని ఆదుర్రు గ్రామం. ఆర్టీసీలో సూపర్వైజర్గా చేసి, ఉద్యోగ విరమణ చేశారు. ఈమె భర్త ఐ.ఎల్.నారాయణ ఏఎస్పీగా పనిచేశారు. నారాయణ మొదటి నుంచి తమ సంపాదనలో కొంతభాగం సేవకి ముఖ్యంగా పేద విద్యార్థులకు చదువు కోసం వెచ్చించేవారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆ సాయాన్ని ఆపలేదు. 2013లో నారాయణ కాలం చేశాక ఆ సేవా కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకుంది గిరజాదేవి.
వీరికి పిల్లల్లేరు. కానీ పేద విద్యార్థులనే తమ బిడ్డలుగా భావిస్తున్నారామె. తన భర్త అయిన నారాయణ తన సంపాదనలో కొంత వెచ్చిస్తే గిరిజాదేవి మాత్రం ఉన్నదంతా సేవకే ధారపోస్తున్నారు. కాకినాడలో ఉన్న డాబా ఇల్లు, బంగారం, ఆస్తి అమ్మేసి, ప్రస్తుతం ఆమే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ వచ్చిన డబ్బంతా సేవకోసమనే ఉపయోగిస్తున్నారు. భర్త పేరిట ఐ.ఎల్.నారాయణ ట్రస్టు(IL Narayana Trust) ప్రారంభించి సేవాకార్యక్రమాలు విసృతపరిచారు. స్వగ్రామం ఆదుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలకు ఇటీవల రూ.40 లక్షలతో ఆరు తరగతి గదులతో అదనపు భవనాన్ని కట్టించారు. గతంలోనూ రూ.10 లక్షలతో సైన్సు బోధన కోసం ఓ భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఏలూరు పోలీస్ క్వార్టర్స్‌లో రూ.16 లక్షలతో విద్యార్థుల కోసం శాశ్వత వసతి సౌకర్యాన్ని కల్పించారు. కాకినాడలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి రూ.12 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రతీ సంవత్సరం కొంతమంది పేద విద్యార్థులను ఎంపిక చేసి, వారి చదువులకు అయ్యే ఖర్చును భరిస్తున్నారు.
విద్యార్థులకు సాయం చేస్తే అది వారొక్కరికే సాయం కాదు రేపటి సమజానికి సాయం చేసినట్లు అని తన భర్త భావించే వారని, అందుకే భర్త అడుగుజాడల్లో సేవాకార్యక్రమాలను కొనసాగిస్తూ పేద విద్యార్థులకు ఎప్పుడూ అండగా ఉంటానంటారు. వీరు చేసిన ఆర్థికసాయంతో చాలా మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని మంచి స్థాయిలో రాణిస్తున్నారని అందుకే తన భర్త ఆశయాలను కొనసాగిస్తున్నట్లు చెప్పుకొస్తారు. అందులో భాగంగానే ప్రతి నెలా వచ్చే పింఛన్ లో కొంత భాగాన్ని కూడా విద్యాభివృద్ధికే దానం చేస్తున్నారు. వారి స్వగ్రామంలోనూ, తన భర్త ఉద్యోగ విరమణ చేసిన ప్రాంతంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కోసం శాశ్వత భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. తమ ఆలోచనలకు సమాజంలో చాలా మంది తోడవ్వడంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాని చెప్తారు. కేవలం విద్యా, పేద పిల్లలకు ఆర్థిక సాయమే కాకుండా మానసిక ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కూడా కొంత విరాళాలు ఇస్తారు. 63 ఏళ్ల వయసున్న గిరజాదేవి ఊపిరి ఉన్నంత వరకు పేదల విద్యాఅభివృద్ధికోసమే పాటుపడుతా అని అంటారు.
కేవలం డబ్బులు ఇచ్చేసి ఊరుకోరామె. పాఠశాలకొచ్చి పిల్లలతో గడుపుతుంటారు. ప్రేమగా మాట్లాడుతూ వారికి చదువు గొప్పదనాన్ని చెబుతారు. విద్యార్థుల కలలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకుంటారు. వారి అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేస్తుంటారు. విద్యార్థులకు మంచి మాటలు చెబుతూ ప్రేరణ కలిగిస్తారు. అందుకే పిల్లలకు గిరిజాదేవి అంటే అమితమైన ప్రేమ. మరి ఇంత చేస్తున్నా ఎక్కడా ప్రచారాలకు ఇష్టపడరు. ఎవరైనా పొగడబోతే మాత్రం ఇదంతా నా పిల్లల శ్రేయస్సు కోసమే కదా అని ఎంతో నిర్మలంగా సమాధానమిస్తారు. ఆవిడ చేస్తున్న సేవాలకు ఎవరైన సన్మానం చేద్దామని వచ్చినా.. తన భర్త ఆశయాలను నిర్వర్తించడమే తన లక్ష్యమని, వీలైతే పేద విద్యార్థులందరికీ చదువు అందేలా చూడండి అని సలహా ఇస్తుంటారు. తాను ఎప్పుడు పొగడ్తలకోసమో, సన్మానాల కోసమే ఈ సేవాకార్యక్రమాలు చేయడం లేదని సున్నితంగా సమాధానం ఇస్తారు.