గత కొన్నిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కాక రేపుతున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ సర్కార్ భద్రతను తగ్గించింది. ఇప్పటివరకు ఆయనకు 2 ప్లస్ 2 భద్రత ఉండగా ఇప్పుడు దానిని తగ్గించింది. ఇప్పుడది 1 ప్లస్ 1కు ఏపీ సర్కార్ చేసింది. భద్రత తగ్గింపుపై కోటంరెడ్డి కూడా సమ్మతిస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసినట్లు సమాచారం. వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కూడా గతంలో భద్రత తగ్గించడం తెలిసిందే.
తన ఫోన్ ను సొంత పార్టీయే ట్యాపింగ్ చేస్తోందంటూ కోటంరెడ్డి ఇటీవల వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహించి చెబుతున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. పార్టీ పెద్దలు రంగప్రవేశం చేసినా కోటంరెడ్డి తన ఆరోపణలకు తెరదించలేదు సరికదా, ఆధారాలు ఇవిగోనంటూ మరో ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో పార్టీకి ఆయనకు మధ్య సంబంధం దాదాపు తెగిపోయింది. ప్రస్తుతం ఆయన భద్రత తగ్గింపుతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.