రాజధాని అమరావతి అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ ప్రభుత్వం గతంలో పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ సూచించింది.
చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి, వేలాది ఎకరాలు సేకరించారు. రాజధాని కోసం నిర్మాణాలు చేశారు. పరిపాలన అక్కడి నుండి ప్రారంభించారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులను తీసుకు వచ్చింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పరిగణిస్తూ చట్టం తెచ్చారు.
దీనిపై అమరావతి రైతులు సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల చట్టాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రాజధానిపై అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం లేదని చెబుతూ, అమరావతి మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.