ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఏపీ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయనపై భూ కబ్జా అని విపక్షాలు ఆరోపించాయి. దీనిపై శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని స్పష్టంచేశారు. అలాంటిది భూములు ఆక్రమించే అవకాశం ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇదీ కావాలనే చేస్తోన్న ఆరోపణలు తప్ప ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గమే ఎవరికైనా భూములను కేటాయిస్తుందనే విషయాన్ని తెలిపారు.
అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. లేదంటే ఆరోపణలు చేసినవారు తప్పుకుంటారా అని అడిగారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కానీ కొందరు కావాలనే డెవలప్ చేయడం లేదని ఊరికనే కామెంట్ చేస్తున్నారని ఫైరయ్యారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు. తమ ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకొని.. రెవెన్యూ మినిస్టర్ భూములు ఆక్రమించారని అంటారని తెలిపారు. మరీ రెవెన్యూ మంత్రికి భూములను దొబ్బే అవకాశం ఉంటుందా..? వారే సమాధానం చెప్పాలని అడిగారు.
ఓ వర్గం మీడియా తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది. నిరాధారంగా వార్తలు రాసి, పబ్లిష్ చేస్తోందని ధర్మాన ప్రసాద రావు అన్నారు. తాను మాట్లాడే మాటలను మాత్రం తీసుకోవడం లేదని చెబుతున్నారు. తాను ఒక్క రూపాయి తీసుకున్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని గుర్తుచేశారు. విచిత్రంగా ఆ మాట పత్రికల్లో రాదన్నారు. ఎందుకో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. తాను చెప్పిన అంశాలు అన్నీ పోయి, మధ్యలో ఉన్న ఒక పదం మాత్రం వస్తోందని తెలిపారు. దానిని హైలెట్ చేస్తారని, తన వెర్షన్ కూడా తీసుకుంటే బాగుండేదని వివరించారు. కానీ తిమ్మిని బమ్మి చేస్తున్నారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
ధర్మాన ప్రసాద రావుకు రెవెన్యూ మంత్రి బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆ పదవీ వరించింది. తొలి దఫా ఆయన సోదరుడు కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉండగా వాన్ పిక్ భూముల కేటాయింపులో ధర్మాన ప్రసాదరావు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. అందులో ధర్మాన ప్రసాద రావు పేరును సీబీఐ పేర్కొంది. దీంతో మంత్రి పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆంధ్రాలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం సాగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి పదవీకి రాజీనామా చేశానని తెలిపారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలో చేరారు. విభజన తర్వాత ఏపీలో తొలి ప్రభుత్వం టీడీపీ ఏర్పడగా.. రెండోసారి వైసీపీకి అవకాశం దక్కింది.