మన్యం: కురుపాం మండలం సీతంపేట గ్రామంలో గుంటిరెడ్డి రామకృష్ణ అనే రైతుకు చెందిన మూడు ఎకరాల కర్బుజా పంటను ఏనుగులు గుంపు ధ్వంసం చేశాయి. దీంతో ఆ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ASR: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని ముంచంగిపుట్టు ఎంపీడీవో శ్రీహర్షసాయి గురువారం పేర్కొన్నారు. ముంచంగిపుట్టులోని నాలుగు రోడ్లకు ఇరువైపులా దుకాణదారులు విధిగా చెత్త కుండీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే స్థానిక హోలీ క్రీడా మైదానంలో సైతం చెత్త వేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు.
VZM: బొబ్బిలి వైసీపీ యూత్ అధ్యక్షుడుగా గొల్లాది సర్పంచ్ బేతనపల్లి శంకర్‌రావును నియమిస్తూ వైసీపీ అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత పదేళ్లుగా పార్టీలో చురుగ్గా పని చేసిన ఆయనను యూత్ అధ్యక్షుడుగా నియమించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన నియామకంపై వైసీపి అధిష్టానం, మాజీ ఎమ్మెల్యేకు శంకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: విద్యార్థులకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చిన తనకు ఫోన్ చేయొచ్చని MLC ఇందుకూరు రఘురాజు విద్యార్థులకు తెలిపారు. గురువారం ఆయన ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, వసతి సౌకర్యాలు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో భేటీ అయ్యారు. పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
KKD: ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో గురువారం వైసీపీ ప్రముఖ నాయకులు ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముద్రగడగిరి ఆత్మీయ కలయికతో పర్యటన చేశారు. లంపకలోవ వైసీపీ నాయకులు, కార్య కర్తలు అభిమానులు ముద్రగడకి ఘన స్వాగతం పలికారు. ముద్రగడ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలతో ఉన్న అనుబంధంతోనే గిరిబాబుని రాజకీయాల్లోకి తీసుకువచ్చానన్నారు.
కాకినాడ: శంకవరం మండలం అన్నవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ అధికారుల సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించగా 30 రోజులుగాను రూ.1,33,1044 కోట్లు, బంగారం, 62 గ్రాములు, వెండి 525 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
W.G: మాజీ ఎమ్మెల్యే వైటి రాజా కుటుంబ సభ్యులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం పరామర్శించారు. వైటి రాజా తల్లి రాజేశ్వరి దేవి మృతి చెందడంతో గురువారం ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేశ్వరి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
E.G: జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా కంఠమణి రమేష్ బాబుని నియమిస్తూ పార్టీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కంటమణి రమేష్ బాబు కొవ్వూరు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యువతను సమాయత్తం చేయడంతో రమేష్ ను జిల్లా యూత్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
W.G: ప్రజల రక్త మాంసాలతో సంపద సృష్టిస్తారా అంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు కొనసాగించలేమని చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ అందిస్తానని చెప్పారని గుర్తు చేశారు.
GNTR: MSIDC కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుని గురువారం మంగళగిరి ఆటోనగర్‌లోని కార్యాలయంలో ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన మంగళగిరి, పిఠాపురం 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులపై చర్చించారు. రాష్ట్రంలో మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను పేదప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కృషిచేయాలన్నారు.
W.G: జిల్లాలో 93 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 69,884 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, వారిలో 39,780 మంది పురుషులు, 30,103 మంది మహిళా ఓటర్లు, 1 ట్రాన్స్ జెండర్ ఉన్నారని తెలిపారు. ఫారం-18లో గ్రాడ్యుయేట్ల పేర్లను చేర్చడానికి దరఖాస్తులను ఫిబ్రవరి 10, 2025 వరకు గడువు ఉందని తెలిపారు.
SKLM: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ని ఎమ్మెల్యే శంకర్ ఆహ్వనించారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు.
కృష్ణా: తిరువూరు మండలంలోని అక్కపాలెం, గానుగపాడు, G.కొత్తూరు గ్రామాల్లో గురువారం CI గిరిబాబు ఆధ్వర్యంలో SI సత్యనారాయణ గ్రామసభ ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించి ప్రమాదాల భారీన పడకుండా ఉండాలని CI అన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాపారులు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని CI అవగాహన కల్పించారు.
ప్రకాశం: స్మార్ట్ మీటర్స్ వల్ల ఉపాధి కోల్పోతున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ డిమాండ్ చేశారు. కనిగిరిలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ మీటర్ రీడర్స్ చేత వెట్టి చాకిరి చేయించుకుని ప్రభుత్వాలు వారిని విస్మరించాయన్నారు.
VZM: పారదర్శకంగా భూ రీసర్వే నిర్వహించాలని తహసీల్దార్ సుదర్శన రావు కోరారు. నెల్లిమర్ల మండలం బొప్పడాం గ్రామంలో గురువారం నిర్వహిస్తున్న భూ రీ సర్వేని ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రీ సర్వేని నిర్వహిస్తుందని అందులో భాగంగానే బొప్పడాం గ్రామాన్ని పైలెట్‌గా ఎంపిక చేశారని చెప్పారు. భూ రీసర్వేని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.