PLD: ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సొలస, మర్రిపాలెంకు చెందిన ఇస్మాయిల్, రమేష్ బైక్‌పై వెళ్తున్నారు. వారు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తిరుపతిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UDG) సిస్టమ్ దెబ్బతిందని MLA శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రస్తావించారు. తిరుపతిలో పాత 60KM డ్రైనేజీ బాగు చేసి కొత్తగా 125KMల మేర UDG నిర్మాణానికి రూ.152కోట్లు కావాలని, అలాగే 42వేల ఇళ్లకు కొత్తగా కనెక్షన్ ఇవ్వడానికి రూ.36కోట్లు అవసరం అని MLA కోరారు. ఇప్పటికే ప్రతిపాదనలు చేశామని తెలిపారు.
KRNL: సొగనూరు గ్రామంలో జరగనున్న సుంకలమ్మ, మారెమ్మ అవ్వల దేవాలయం మహోత్సవానికి భక్తులకు ఇబ్బంది లేకుండా బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తిపై బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ వెంటనే స్పందించారు. ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
BPT: రేపల్లెలో శుక్రవారం ‘అనగాని ప్రజా దర్బార్’ కార్యక్రమం జరిగింది. ఇందులో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ఈ సమస్యలన్నింటినీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని నాయకులు ప్రజలకు హామీ ఇచ్చారు.
GNTR: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలోకి శుక్రవారం ఓ అజ్ఞాత వ్యక్తి చొరబడ్డాడు. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్ల అద్దాలను అతడు ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఆకతాయిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హుటాహుటిన మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
కృష్ణా: అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా కలంకారీ వస్త్రాలను శుక్రవారం ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, కుమార్ సందర్శించి వస్త్రాలను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన కలంకారి పరిశ్రమ పెడనలో నియోజకవర్గంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణ ప్రసాద్ అన్నారు. త్వరలో కలంకారి క్లస్టర్ పెడనలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సత్యసాయి: ధర్మవరం మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
ATP: జిల్లాలో ఆహార కల్తీపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. హోటళ్లు, దాబాల్లో నాసిరకం నూనెలు, హానికర రంగులు వాడుతుండటంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. అయితే, జిల్లాలో ఫుడ్ తనిఖీ కోసం కేవలం ఒక్కరే ఆహార భద్రతా అధికారి ఉండటం గమనార్హం. సిబ్బంది కొరత అక్రమార్కులకు వరంగా మారింది. ఖాళీలను భర్తీ చేసి తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కోనసీమ: ఈనెల 28న మలికిపురం ఎంవీఎన్ జెఎస్ అండ్ ఆర్ వీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వికాస్ జిల్లా అధికారి డి.హరిశేషు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం, వికాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళాలో పది కంపెనీలు పా ల్గొంటున్నాయని 410 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుని రూపంలో కల్పవృక్ష వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. పురవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులు పట్టగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఏలూరు వి.వి.నగర్ వద్ద మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ప్రదర్శన జరిపారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించలేదని వారు విమర్శించారు. జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
NLR: ఉదయగిరి మేజర్ పంచాయతీలో ఇంటి పన్నులు చెల్లించని వారిపై శాఖా పరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో ఎస్.మోహన్ రావు తెలిపారు. పట్టణంలోని ఇంటి యజమానులు పంచాయతీ అధికారులకు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
E.G: రంగంపేటలో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శివాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. MLA నల్లమిల్లి సహకారంతో రూ.1.50 కోట్ల నిధులు మంజూరైనట్లు సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మీ దుర్గారావు తెలిపారు. అధికారులు, కూటమి నేతలు, భక్తుల సహకారంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య: మదనపల్లె రెండో పట్టణ ఎస్సైగా నాగేశ్వర రావు శుక్రవారం ఉదయం రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేస్తున్న రహీముల్లా ఒకటో పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో సాధారణ బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో చౌడేపల్లి ఎస్సైగా పనిచేస్తున్న నాగేశ్వరరావు టూ టౌన్కు వచ్చారు.
AKP: ఇటీవల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన మోడల్ టెస్ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ బహుమతులు ప్రకటించింది. ఎస్ రాయవరం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం డిప్యూటీ డీఈవో అప్పారావు చేతుల మీదగా 11 మందికి బహుమతులు అందజేసినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం బాలాజీ తెలిపారు. పరీక్షలపై భయం పోగొట్టేందుకు మోడల్ టెస్ట్ నిర్వహించమన్నారు.