KDP: రాజంపేట మున్సిపాలిటీలో తాగునీటి నాణ్యతపై మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ అకస్మాత్ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు నీటి సరఫరా కేంద్రాలను పరిశీలించిన కమిషనర్, నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వేసవికాలంలో నీటి కొరత లేదా నాణ్యత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ASR: జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధించినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ గురువారం తెలిపారు. ఈ కేసులో పాంగి రమేష్ అలియాస్ పోయి రమేష్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారన్నారు. పోక్సో ప్రత్యేక కోర్టు నిందితుడికి శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
CTR: పుంగనూరు(M) కుదవపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యానికి CMRF ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే గురువారం పార్టీ కార్యాలయంలో రూ.1,44,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
PPM: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు సూచించారు. వేసవిలో డీహైడ్రేషన్ నివారించేందుకు తగినంత నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని తెలిపారు. సూర్యరశ్మి నుంచి రక్షణగా గొడుగు, టోపీ వాడాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు ఉంచాలన్నారు.
తూ.గో: కొవ్వూరు ఆర్డీవోగా రాజా రమేశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రూప్-1 అధికారులను బదిలీ చేయగా, ఆ ఉత్తర్వులతో ఆయన కొవ్వూరుకు నియమితులయ్యారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన ఆర్డీవోకు స్వాగతం పలికారు.
KDP: రాయచోటిలో పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. లూజ్ పాలు విక్రయించే అవుట్‌లెట్ల నుంచి 6 పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. పాలలో కల్తీ నిర్ధారణ అయితే ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కర్నూలులోని KVR మహిళా డిగ్రీ కాలేజీలో రేపు జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ICICI బ్యాంక్‌లో సేల్స్, రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు 2024, 2025లో బీఏ, బీకాం, BSC, BCA, BBA పూర్తి చేసిన 25 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఇంజినీరింగ్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ చేసిన వారు అనర్హులని ప్రిన్సిపాల్, జేకేసీ కోఆర్డినేటర్ అన్నారు.
NDL: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం దిగువ అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ప్రహ్లాద వరద స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని అర్చకులు ఆదిశేషుడిపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.
VZM: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఈ. మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా, కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
KDP: వేంపల్లె(మం) నాగూరులో బుధవారం ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గురువారం టీడీపీ ఇంఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డికి ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
ASR: అనంతగిరి మండలంలో కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. డముకు, నిమ్మలపాడు నుంచి పెద్దబిడ్డ వరకు జరుగుతున్న తారు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అనంతగిరి పీహెచ్‌సీని పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం చెరుకుబిడ్డ ఎంపీపీ పాఠశాల పరిశీలించారు
NTR: విజయవాడలో మూడో రోజు లెజిస్లేటివ్ క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. క్రికెట్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్, మ్యూజికల్ చైర్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, కబడ్డీ, చెస్, వాలీబాల్, షాట్‌పుట్, త్రోబాల్ పోటీలు నిర్వహించారు. వివిధ క్రీడల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడుతూ ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ELR: అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి కామవరపుకోట మండలం తడికలపూడిలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు.
VZM: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ గురువారం తీర్పు చెప్పారు. గజపతినగరానికి చెందిన పూసర్ల రామలింగేశ్వర రావు అదే గ్రామానికి చెందిన కొల్లా కనక వెంకట సత్యనారాయణకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. ఈమేరకు రామలింగేశ్వరరావుకు ఏడాది జైలు శిక్షతోపాటు రెండు లక్షల 40 వేల రూపాయలు జరిమానా విధించారు.
కృష్ణా: గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్పీఎస్ బ్లాక్‌లోని షాప్స్ అద్దె/ లైసెన్స్ ఫీజులు భారీగా పెండింగ్లో ఉండడంతో అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. పన్ను చెల్లించని కొంతమంది షాపులకు తాళాలు వేశారు. అన్ని షాపులో యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బకాయిలను చెల్లించి, అనవసర సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులు సూచించారు.