BPT: అద్దంకి మండలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బొమ్మనంపాడు, శంఖవరప్పాడు, ధర్మవరం గ్రామాల జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు బొమ్మనంపాడు, 10:30 గంటలకు శంఖవరప్పాడు, 11:30 గంటలకు ధర్మవరం పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె-రాయలపంతులపల్లె మధ్య ఉన్న జె.వెంకట్రామిరెడ్డి సమాధి వద్ద ఆదివారం సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు సంక్షేమం, రాయలసీమకు కృష్ణా జలాలు తేవడం, గండికోట ప్రాజెక్టు సాధన కోసం జెవీ అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడని సీపీఐ సీనియర్ నాయకుడు పులి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సీపీఐ నేతలు పాల్గొన్నారు.
NDL: రామ్‌కో పరిశ్రమ వల్ల నష్టపోయిన రైతులు ధర్నా చేస్తామంటే అడ్డుకుంటామని టీడీపీ మండల అధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు పుల్లయ్య విమర్శించారు. కొలిమిగుండ్లలో సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. మూలె రామేశ్వరరెడ్డి రైతుల పక్షమా?, పరిశ్రమ పక్షమా? స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏలూరు 15వ డివిజన్ ఆముదాల అప్పలస్వామి కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆదివారం ప్రారంభించారు. డివిజన్ ఇంఛార్జ్ పైడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేదల సమస్యలను తక్షణమే పరిష్కరించే వారే నిజమైన నాయకులని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు.
KDP: ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి నిర్మాణంలో ఉన్న నూతన ఆలయాన్ని ఆదివారం MLC రామ్ గోపాల్రెడ్డి సతీమణి ఉమాదేవి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పలు విషయాలను వివరించారు. ఆలయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని ఆమె అన్నారు. త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేయించి భక్తులకు నూతన ఆలయంలో దర్శనాలు కల్పిస్తామని తెలిపారు.
VZM: మహిళా దినోత్సవం సందర్భంగా మై భారత్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం బాబామెట్టలోని విజ్జీ స్టేడియంలో నిర్వహించారు. అండర్–13, 13–18, 18 సంవత్సరాల పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగుపందెం పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు.
సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని ఆర్టీసీ జిల్లా కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. వ్యక్తిగత జీవితం, ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లు, సిబ్బంది సేవలను అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. మహిళలు ధైర్యంతో ముందడుగు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కడప జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ఉంటుంది. వినియోగదారులు 08562-242457కు సంప్రదించాలని సూచించారు.
CTR: సదుం మండలంలోని 79 ఏ చింతమాకులపల్లె పంచాయతీ కారేవాండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం సీతారామ, లక్ష్మణ పంచలోహ విగ్రహ ప్రతిష్ట, హోమాలు, కుంభాభిషేకం, దర్శన కార్యక్రామలు జరిపారు. వేదపండుతుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారామ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
NTR: తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ ఔట్ గేటు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ధర్నా నిర్వహించారు. పెరిగిన వంట గ్యాస్ ధరలతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ట, రాజగోపుర కలశ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొన్నారు. నూతన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడి కలశాల నీరాజనం, కలశ ప్రతిష్టా కార్యక్రమాల్లో వారు శాస్త్రోక్తంగా పాలుపంచుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
NLR: పొదలకూరు జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9వ విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
PLD: దుర్గి మండలం పరిధిలోని అడిగొప్పల గ్రామ సమీపంలోని నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. ఉదయం నుండే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు తయారుచేసి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పుంగనూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రూ.59 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధితో రైతులకు సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ELR: సృష్టికి మూల స్తంభం స్త్రీ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆదివారం దెందులూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ‘బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి-ఉన్నతి, pmajy’ పథకాల ద్వారా 13,594 మంది స్వయం సహాయక సంఘాల రూ.292 కోట్ల చెక్కు అందజేశారు.