KRNL: ఎంపీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై బుధవారం ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2024-26 ఆర్థిక సంవత్సరాల పనులపై చర్చించిన ఎంపీ, నిధుల ఖర్చులో అలసత్వం వహించవద్దని ఆదేశించారు.
కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో ఉన్న శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ మేరకు 4 నెలల 18 రోజులకు గాను రూ.3,95,570 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వెంకటరమణ మూర్తి తెలిపారు. పలివెల ఈవో పి.కామేశ్వర రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ, సర్పంచ్ పల్లి భీమారావు తదితరులు పాల్గొన్నారు.
NLR: మనుబోలులోని ఆంధ్ర విలాస్ హోటల్ ఎదురుగా హైవేపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జట్లకొండూరుకు చెందిన పెంచలయ్య పల్లవ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. పని మీద సొంత ఊరు నుంచి మనుబోలుకు రాంగ్ రూట్లో బైకుపై వస్తుండగా అదే సమయంలో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పాల ఆటో ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.
NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని రైజ్ సెంటర్‌ను కలెక్టర్ లక్ష్మీశా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులు తయారీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబులై కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.
SKLM: ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్, మండలి ఛైర్మన్ మోషేను రాజులను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అనుచితమని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమని, సభ గౌరవాన్ని దెబ్బతీసే చర్య అన్నారు.
E.G: కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ సర్పంచ్ అన్నదేవుల చంటి ఆధ్వర్యంలో అక్కడి స్మశానవాటిక అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా స్మశానవాటికలో కాటికాపరి విగ్రహాన్ని చంటి తన సొంత నిధులతో అత్యంత సుందరంగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించనున్నారు.
ATP: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్-2026) పరీక్ష రాయదలచిన విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీలోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. గుంతకల్లుతో పాటు ఈ సంవత్సరంలో గుత్తిలో కూడా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సత్యసాయి: కదిరిలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద స్వరూపుడైన గరుత్మంతుడిని అధిరోహించిన మోక్ష నరసింహుడిని దర్శించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
W.G: భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ వినతులు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, భూముల రీ-సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
VZM: నెల్లిమర్ల మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు బుధవారం భోగాపురం మండలంలోని బైరెడ్డిపాలెం, చేపలకంచేరు, ముక్కాం, రామచంద్ర పెట గ్రామాల్లో YCP గ్రామ కమిటీ సభల్లో పాల్లొన్నారు. ఆయన మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేసారు. కమిటీల నియామకం పూర్తి చేసి మండల YCP కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డికి అందజేయాలని సూచించారు.
PPM: జిల్లాల్లో రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా నుంచి అర్హులైన వారి భూములకు హక్కులు కల్పించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో అమరావతి నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు.
AKP: దేవరాపల్లి మండలంలో ఉపాధి హామీ పనుల అమలును అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రైవాడ, గరిసింగి, దేవరాపల్లి పంచాయతీల్లో జరుగుతున్న పనులను ఏపీఓ రుక్మిణీదేవి, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణరావు పరిశీలించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వలసలు తగ్గించుకోవాలని కూలీలకు సూచించారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ హెడ్ కుక్ డి.రమణమ్మను చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో బుధవారం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన సొంత కూతురు ప్రదీపకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రమణమ్మ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసింది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి అనూష నిందితురాలికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు.
SKLM: జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసే ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ పృథ్విరాజ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక రిమ్స్‌లో సమావేశం నిర్వహించారు. ఆయన మట్లాడుతూ.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ వైద్య సిబ్బంది సరఫరా చేసిన ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వాడుట ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.
KDP: కొండాపురం మండలం డొంకపల్లి గ్రామంలోని ఆశ్రమం గుడి వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఎస్సై జయరాములు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,040 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.