VZM: డీఎంహెచ్‌వో పేరుతో వస్తున్న నకిలీ ఉద్యోగ ప్రకటనలు నమ్మవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. జీవన రాణి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొన్నారు.
KDP: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ డీవైఎఫ్ఎ కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్ని, శివకుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి అందించిన దాఖలాలు లేవన్నారు.
SKLM: నరసన్నపేట మండలం యారబాడు గ్రామానికి చెందిన రాకోటి అప్పారావు మాస్టర్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఏలూరు: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 48 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన ఆయన సమస్యలను పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలనుకునేవారు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
NTR: మైలవరం నియోజకవర్గ వైసీపీ పరిశీలకురాలిగా విజయవాడ కార్పొరేటర్ బండి పుణ్యశీలను నియమిస్తూ వైసీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇబ్రహీంపట్నంలో నివాసముంటున్న మాజీ మంత్రి జోగి రమేష్‌ని సోమవారం వైసీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెను జోగి రమేష్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
VZM: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గజపతినగరం కానిస్టేబుల్ టీ.తిరుపతిరావు కుటుంబానికి చేయూత చెక్కును రూ. 1,47,800ను ఆయన భార్య దమయంతికి అదనపు ఎస్పీ సౌమ్యలత సోమవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ప్రోగుచేసి మరణించిన కుటుంబానికి చేయూత రూపంలో అందించడం గొప్ప త్యాగం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో పాల్గొన్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,77,101 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 164 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 18 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించామన్నారు. 2670 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
GNTR: తెనాలిలోని ఐతానగర్ నుంచి గోలిడొంక వెళ్లే రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.40 లక్షల అంచనాతో 270 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనప్పటికీ, సగం పనులు మాత్రమే చేసి వదిలేశారు. దీంతో రాకపోకలు నరకప్రాయంగా మారాయని, వెంటనే అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
VZM: మద్యం సేవించి వాహనాలు నడిపిన 107 మందికి జిల్లా కోర్టు రూ.10.70 లక్షల భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఫైన్ పడిందని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పేర్కొన్నారు.
TPT: ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, అనుమానితులకు పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలని, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓజిలిలో రౌడీ షీటర్లు, అనుమానితులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
PLD: రాజుపాలెం మండలం గణపవరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 97వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కన్నా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రకాశం: కలిగిరి మండలం పరికోట గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి MLA కాకర్ల సురేష్ పాల్గొన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను MLA అందజేశారు. గత ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో అనేక అవకతవకులు జరిగాయని అటువంటి తప్పిదాలు జరగకుండా CM చంద్రబాబు పారదర్శకంగా పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
ATP: గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్ల బాలికలకు HPV టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో 16,449 మంది బాలికలు ఉన్నారని, ఈ నెల 11 నుంచి మూడు నెలల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి విద్యార్థులకు హాఫ్ డే స్కూల్ సమయాన్ని ఉపయోగకరంగా మార్చేందుకు కుట్టు మిషన్లు అవసరమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కోరారు. ఆయన వెంటనే స్పందించి విద్యార్థుల కోసం రెండు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ మిషన్ల ద్వారా విద్యార్థులు స్వయంగా తమ బట్టలను తాము కుట్టుకునే విధంగా నైపుణ్యం అభివృద్ధి చెందుతారన్నారు.
సత్యసాయి: మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తి జగన్ అని మంత్రి సవిత విమర్శించారు. సోమవారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై అనేక దాడులు జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబును విమర్శించే హక్కు జగన్‌కు లేదన్నారు.