KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రేషన్ డీలర్లు రేషన్ పంపిణీ సక్రమంగా జరగడంలేదన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. రేషన్ షాపుల్లో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఒకటి, రెండు రోజులు పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో రేషన్ షాపులు మూసివేసి స్టాక్ లేదని చెబుతుండటంతో అవస్థలు పడుతున్నామన్నారు.
TPT: పాకాల మండలం ముద్దలపల్లి పొలాల్లో తలారిపల్లెకు చెందిన ముత్తిరేవుల సుబ్రహ్మణ్యం (45) మృతదేహం లభ్యమైంది. తలపై బలమైన గాయం ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NLR: ఆరోగ్య శాఖలో NHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని DMHO సుజాత గురువారం తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు మెరిట్ జాబితాను spsnellore.ap.gov.in/recruitment లో పరిశీలించాలని కోరారు.
ప్రకాశం: బీసీవైఎం పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గురువారం కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బీసీ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై సంక్షిప్తంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు.
SKLM: లావేరు మండలం గుర్రాలపాలెం పంచాయతీ పరిధిలోని రోడ్డు అధ్వానంగా తయారైంది. గుర్రాలపాలెం నుంచి బాణం, జి.సిగడాం, పొందూరు మండలాలకు వెళ్లే రోడ్డులో గత ఏడాది కిందట మెటల్ రాళ్లు వేసి వదిలేశారు. రోడ్డుపై రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
NDL: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 10 రోజులవుతున్నా నీటి సరఫరా చేయకపోవడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పనులను సాకుగా చూపి అధికారుల నిర్లక్ష్యంతో నీటి సరఫరా చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాగేందుకు చుక్క నీరు లేదు కానీ రోడ్లకు క్యూరింగ్ చేసేందుకు ఫిల్టర్ హౌస్ నీటిని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ATP: రజక జాతి చిన్నారి మౌనిక మృతికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం గుత్తి శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రజక సంఘం నాయకులు కిరణ్, సురేష్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మౌనికపై దాడి చేసి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ పంచి రెడ్డి రాంబాబు చెక్ పవర్‌ను పలు ఆరోపణలతో 10 నెలల క్రితం అధికారులు రద్దు చేశారు. అయితే తన తప్పు లేదని జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో పదిసార్లు ఫిర్యాదు చేశారు. చివరకు హైకోర్టుని ఆశ్రయించగా చెక్ పవర్ పునరుద్ధరించాలని తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అమలుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో గురువారం 65-70 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని, మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
NTR: నందిగామ ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు గురువారం అంబారుపేట గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి జరుగుతున్న హౌస్ టాక్స్ వసూళ్లను స్వయంగా పరిశీలించారు. నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
VZM: ఎల్.కోట మండలం ఆర్.జి.పేట పరిసర ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అసెంబ్లీలో కోరారు. ఆర్.జి.పేట సమీపంలో ఉన్న పరిశ్రమల కారణంగా చుట్టుపక్కల ఉన్న సుమారు 15 గ్రామాలకు లో-వోల్టేజ్ సమస్య తలెత్తుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు.
VSP: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ముగ్గురు నేతల ఫొటోను మంత్రి లోకేశ్ పంచుకున్నారు. లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు కలిసి ఉన్న ఈ ఫొటోలో గెలుపు తమపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిబద్ధతతో సేవ చేస్తామని తెలిపారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,684 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 1,584 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన భవనాల నిర్మాణంతో పాటు కేంద్రాల్లో కనీస సదుపాయాలకు నిధులు కేటాయించాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తేనే పిల్లల హాజరు పెరుగుతుందని అన్నారు.
VSP: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో కొలువు దీరిన పరదేశమ్మ తల్లి జాతర ఈ నెల 9, 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది భారీ ఎత్తున్న జాతర చేయనున్నట్లు గ్రామ పెద్దలు, యువత తెలిపారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.