కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదని సూచించారు. అందరం ఏకమైతే మూర్కుల, అసమర్థుల పాలనకు ముగింపు పలకవచ్చున్నారు. ప్రసంగం చివరలో జై భారత్ అంటూ ముగించడం గమనార్హం.
కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించిన సమయంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరాలు కురిపించారు. జిల్లాలోని మొత్తం 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున, మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పదివేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల నిధులు, కేటాయిస్తున్నామని, మున్నేరు నదిపై బ్రిడ్జి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.