ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.500 నోట్లు, రూ.2000 నోట్లను దాచిపెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల 500, 2000 నోట్ల రూపాయలు కనిపించడం లేదని, అన్నీ జగన్ ఇంటికి వెళ్లిపోయాయన్నారు. ఆ నోట్లను ఎక్కడికెక్కడికో పంపించి నిల్వ చేస్తున్నారని, వాటితో ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డబ్బులు పంచినప్పటికీ ప్రజలు జగన్కు వాతపెట్టడం ఖాయమని, ఇప్పటికే వారు ఓ నిర్ణయానికి వచ్చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని దుయ్యబట్టారు. దానిని కట్టాల్సింది ప్రజలేనని గుర్తు చేశారు.
జగన్ నాసిరకం సొంత బ్రాండ్ల మద్యాన్ని తాగాలంటూ జనంపై ఒత్తిడి తెస్తున్నారని, దానిని తాగి జనం చనిపోతే పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అధికారాన్ని, అవినీతిని జగన్ కేంద్రీకరించారని విమర్శించారు. మద్యం, ఇసుకను వారే అమ్ముతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని, సాయంత్రానికి గల్లాపెట్టె నిండిందా లేదా అని చూసుకోవడం తప్ప ముఖ్యమంత్రికి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి లేదని ఆరోపించారు. తాము బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే వైసీపీ నేతలు చించేశారని, ఎందుకు చేశారని అడిగినందుకు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు వేసి, పైగా వాళ్లే కేసు పెడుతున్నారన్నారు. ఇంత రాక్షసత్వం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. నాడు ఎన్టీఆర్ భయపడి ఉంటే రాజకీయ పార్టీ పెట్టేవాడే కాదన్నారు.
దేశంలోనే మొదటిసారి వైద్య విద్యకు సంబంధించి యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని, అలాంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి, వైయస్సార్ పేరు పెట్టిన దుర్మార్గుడు జగన్ అన్నారు. చివరకు వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తీసేసి వైయస్ విగ్రహం పెట్టడం దుర్మార్గమన్నారు. తిరుమలలో అన్నదాన కార్యక్రమం ఎన్టీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఈ సైకో పాలనకు చరమగీతం పాడాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కంటే ముందు పాతబస్తీలో మతఘర్షణలు జరిగేవని, ఆయన సీఎం అయ్యాక వాటిని లేకుండా చేసారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ సృష్టికర్త అయితే, జగన్ విద్వంసకారుడని మండిపడ్డారు.