వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి గెలుపొందడం ఖాయమన్నారు. వైసీపీ 175 సీట్లలో గెలుస్తాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అదీ కలలో కూడా జరిగే అవకాశం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజల నుంచి ఆదరణ లభించనుందని తెలిపారు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే వైసీపీకి ఓటమి తప్పేలా లేదన్నారు. అబద్దాలతో ఎన్నిరోజులు నాటకాలను ఆడగలమని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యం చేసి చూపిస్తానని హామీ ఇవ్వడంతో జనం అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే జనం ఎందుకు ఒక్క ఛాన్స్ ఇచ్చామోనని బాధపడుతున్నారని వెల్లడించారు.
14 శాతం వరకు మెజార్టీ
12 శాతం నుంచి 14 శాతం మెజార్టీ టీడీపీ, జనసేన కూటమికి లభించే అవకాశం ఉందన్నారు. కుల, మతాలకతీతంగా కూటమికి అండగా ఉంటారని తెలిపారు. ఇటీవల ప్రాంతాల వారీగా సర్వే చేశానని తెలిపారు. టీడీపీ, జనసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తోందని చెప్పారు. ఉత్తరాంధ్రలో 10% నుంచి 12% టీడీపీ, జనసేనలకు ఎడ్జ్ ఉందన్నారు. ఉభయగోదావరి జిల్లాలలో 14% నుంచి 16%శాతం, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12% నుంచి 14% శాతం, ఒంగోలు నెల్లూరులో 8% నుంచి 10%, అనంతపురం, కర్నూలులో 10% నుంచి 12%, కడప చిత్తూరులో 6% నుంచి 8% శాతం టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగా ఉందన్నారు.
ప్రజలపై చెత్త పన్ను
ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.7% హామీలను అమలు చేయలేదన్నారు. ప్రజలపై చెత్త పన్ను వేస్తామని చెప్పలేదు.. కానీ వేశారని మండిపడ్డారు. ఆస్తి పన్నును పెంచారని, విద్యుత్ చార్జీలను ఏడు సార్లు పెంచారని గుర్తుచేశారు. తన సర్వే నిజం అవుతుందని, ఇదివరకు టీడీపీ జనసేన జట్టు కడతాయని చెప్పానని తెలిపారు. 45 రోజుల్లో నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను చెబుతానని తెలిపారు.