కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా తాము పార్టీని ప్రారంభించామని కేసీఆర్ చెప్పగా, అందుకు తాము జతకలుస్తున్నామని మిగతా జాతీయ ప్రముఖులు తలలు ఊపారు! సరే… 2024లో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన అంశాన్ని పక్కన పెడితే, లెఫ్ట్ పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు, చేసిన చేష్టలకు పొంతన కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సిద్ధాంతాలకు నీళ్లు
గతంలో లెఫ్ట్ పార్టీ ప్రజా సమస్యలపై మాత్రమే పోరాడి, వారి మన్ననలు పొందే ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు ఆ పార్టీలు కేవలం హిందూ వ్యతిరేకతకు, బీజేపీ వ్యతిరేకతకు మాత్రమే పరిమితమైందనేది కమలదళం వాదన. నిన్నటి కేరళ సీఎం పినరాయి విజయన్ తీరు బీజేపీ ఆరోపణలు నిజం చేసేలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన ప్రముఖులను యాదాద్రి లక్ష్మీనరసింహుడి దర్శనానికి తీసుకువెళ్లారు కేసీఆర్. అక్కడ తాను చేసిన అభివృద్ధిని వారికి చూపించారు. కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేష్, పినరాయి విజయన్, డీ రాజా హెలిప్యాడ్‌లో దిగి సమీపాన గల ప్రెసిడెన్షియల్ సూట్ కాంప్లెక్స్‌కు వెళ్లారు. అక్కడి నుండి మిగతా నేతలు స్వామి దర్శనానికి వెళ్లినప్పటికీ, విజయన్, డీ రాజా మాత్రం దూరంగా ఉన్నారు.
వీరు గెస్ట్ హౌస్ నుండే ఆలయ పునర్నిర్మాణం, ఇతర కట్టడాలను పరిశీలించారు. లౌకికవాదం గురించి తమకు సూక్తులు వల్లించే లెఫ్ట్ పార్టీ నేతలు ఏం చేస్తున్నారని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడటమని, ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన ముఖ్యమంత్రి విజయన్ కూడా దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందులోనే వారి లౌకికవాదం తేటతెల్లమవుతోందనేది బీజేపీ నేతల వాదన. ఇక, కమ్యూనిస్ట్ నేతలు పొత్తులపై మాట్లాడిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసిందని చెబుతున్నారు.
బీజేపీయే టార్గెటా?
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని కేసీఆర్ చెప్పారని, ఆ ఒక్క కారణంతోనే బీఆర్ఎస్కు మద్దతిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పడం గమనార్హం. బీజేపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామన్నారు. అంటే దేశం, ప్రజల సమస్యలను వారు పక్కన పెట్టినట్టి, ఒకే ఒక్క టార్గెట్‌తో పని చేస్తున్నట్లు తేలిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు కేసీఆర్‌పై పోరాటం చేసి, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్లో నచ్చిన సిద్ధాంతాలు ఏమిటో చెప్పాలని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వరకు బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీ నేతలు పరస్పరం సూది, దబ్బుడం అంటూ తిట్టుకొని, ఇప్పుడు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, బీజేపీ ఓటమే లక్ష్యంగా మాత్రమే కలుస్తామని చెప్పడం ప్రజలు హర్షించరనేది విశ్లేషకుల మాట. బహిరంగ సభలో ఆసాంతం హిందుత్వం పేరిట బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని చెప్పే ప్రయత్నాలు చేశారు విజయన్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం. కానీ వారు మాత్రం నిజమైన లౌకికవాదాన్ని నిర్వచించే ప్రయత్నం చేయకుండా, కేవలం విషం చిమ్మే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఉనికి కోసమే
మునుగోడులో బీజేపీకి మా పవర్ ఏమిటో చూపించామని, ఇక ఖమ్మంలో చూపిస్తామని లెఫ్ట్ పార్టీ నేతలు చెప్పడం ద్వారా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ బలం తేలిపోయిందని అంటున్నారు. ఈ రెండుచోట్ల లెఫ్ట్ లేకుంటే కేసీఆర్ గెలవలేని పరిస్థితి అని వారే చెబుతున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మునుగోడులో తమ ఓట్ల ద్వారానే బీఆర్ఎస్ గెలిచిందని తేల్చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే లెఫ్ట్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది. ఒకటి రెండుచోట్ల మాత్రమే కాస్త ఓటు బ్యాంకు కనిపిస్తోంది. అలాంటి చోట్ల ఇతర పార్టీలకు అండగా నిలిచి, తమకు లేని బలాన్ని అందరికీ చూపించి, ఉనికి చాటుకునే ప్రయత్నం కమ్యూనిస్టులు చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు.