సలహాదారుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారించిన హైకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని పేర్కొంది. రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. నిష్ణాతులైన వారినే సలహదారులుగా నియమిస్తున్నామని ఏజీ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు ఏజీ తెలిపారు. మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని ఏపీ హైకోర్టుకు ఏజీ తెలుపగా.. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని హైకోర్టు అభిప్రాయ పడింది.