ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో పది పాసై ఉండటమే కాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం కచ్చితంగా వచ్చి ఉండాలి.
అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 16, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయో పరిమితితో ఉండాలి. అర్హులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 16, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 27 నుంచి ప్రారంభం అయ్యాయి. జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్ జండర్, మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. సెలక్ట్ అయిన వారికి ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం ఇస్తారు. బీపీఎం పోస్టులకు రూ.12,000ల నుంచి రూ.29,380ల వరకు, ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల వరకు జీతం చెల్లించనున్నారు. ఇతర వివరాలకు లింక్ https://indiapostgdsonline.gov.in/ పై క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి.