»Nara Lokesh Has Been Served A Notice By The Cid He Has Been Ordered To Appear On October 4
Nara Lokesh: నారా లోకేశ్‌కు నోటీసులిచ్చిన సీఐడీ.. అక్టోబర్ 4న హాజరుకావాలని ఆదేశం
నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన్ని ఏ14గా చేర్చుతూ సీఐడీ అధికారులు స్వయంగా నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 4వ తేదిన ఆయన విచారణకు హాజరుకావాలని సీఐడీ కోరింది.
నారా లోకేశ్ (Nara Lokesh)కు సీఐడీ అధికారులు (CID Notices) నోటీసులిచ్చారు. ఢిల్లీలో ఉన్న లోకేశ్ వద్దకు సీఐడీ అధికారులు స్వయంగా వెళ్లి నోటీసులు ఇవ్వడం విశేషం. ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీ (Delhi)లోని గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐడీ బృందం అక్కడికే వెళ్లి నోటీసులిచ్చింది. అక్టోబర్ 4వ తేది ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Inner Ring Road scam case)లో లోకేశ్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. గత మూడు వారాలుగా లోకేశ్ ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో లోకేశ్ కోసం ఢిల్లీలోని ఏపీ సీఐడీ బృందం (AP CID Team) వెళ్లింది. ప్రస్తుతం తన తండ్రి నారా చంద్రబాబు నాయుడి (Nara chandrababu Naidu)ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే విషయంలో జాతీయ మీడియా ద్వారా లోకేశ్ పలు విషయాలను తెలిపారు.
సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రాతో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ పై కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ14గా నారా లోకేశ్ పేరును చేర్చినట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసు విచారణ అక్టోబర్ 4వ తేది జరగనుండగా ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న తరుణంలో ఇప్పుడు లోకేశ్‌కు నోటీసులివ్వడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.