Nara Bhuvaneswari: చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వైసీపీ పార్టీపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు అసలు భద్రత లేదన్నారు. చంద్రబాబు అనుక్షణం రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తారని.. యువత, మహిళల అభివృద్ధికి కృషి చేయాలనే తపనతో ఉంటారని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఆడపిల్లలు స్వేచ్ఛగా జీవించేవారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత కరువైందని భువనేశ్వరి అన్నారు. దిశ పేరుతో మహిళలను మభ్యపెట్టడమే తప్ప మహిళల రక్షణకు ప్రభుత్వం చేసేదేమీ లేదని ఆమె మండిపడ్డారు.
గత 35 ఏళ్లుగా చంద్రబాబును ప్రజలు గెలిపిస్తున్నారు. ఈసారి తాను పోటీ చేస్తే మద్దతిస్తారా? అని ప్రశ్నించారు. ఇద్దరిలో ఎవరో ఒకరి పేరే చెప్పాలని భువనేశ్వరి కోరగా.. ప్రజలు ఇద్దరూ కావాలన్నారు. భువనేశ్వరి పోటీ చేస్తే సంతోషమే.. అలాగే చంద్రబాబు నాయకత్వం కూడా కావాలన్నారు. అయితే తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని.. కేవలం సరదా కోసమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భువనేశ్వరి తెలిపారు.