ఆంధ్రప్రదేశ్ లోని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక ఆవేదనతో మృతిచెందిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
అందులో భాగంగా నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్రను (Nara Bhuvaneshwari Bus yatra) చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. తొలి రోజు చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతిచెందిన కె.చిన్నస్వామి నాయుడు, ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు.
పరామర్శ తర్వాత బాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భువనేవ్వరి పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం అగరాల గ్రామంలో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. బస్సు యాత్రతో పాటుగా పలు ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో నారా భువనేశ్వరి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
బస్సు యాత్ర ప్రారంభమైన సందర్భంగా నారా భువనేశ్వరి కుమారుడు నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మా..తప్పకుండా నిజం గెలుస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి కలిసి ఉన్న ఫోటోను లోకేశ్ షేర్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు జనసేన, టీడీపీ నాయకుల జిల్లా స్థాయి సమావేశాలు అక్టోబర్ 29, 30, 31వ తేదీల్లో జరగనున్నాయి. అందుకోసం టీడీపీ నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.