ఆంధ్రప్రదేశ్(AP)లో వైసీపీ సర్కారు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ పురందేశ్వరి (Purandeshwari) ఆరోపించారు. రాష్ట్ర కార్పొరేషన్ల పైన, బేవరేజ్ కార్పొరేషన్ వంటి వాటిపైనా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆమె కోరారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కు ఈమేరకు ఆమె ఓ వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.77 లక్షల కోట్లు అప్పు చేసిన విషయాన్ని ఇప్పటికే తమ దృష్టికి తీసుకొచ్చానని.. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే ఉందని చెప్పారు.
ఈ ఏడాది జూలై వరకు వైసీపీ ప్రభుత్వం (YCP Govt) 10.77 లక్షల కోట్లు అప్పులు చేసిందని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మెుత్తం రాష్ట్ర అప్పుల పైన అడిగిన ప్రశ్నకు జవాబుగా కేవలం ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రూ.4.42 లక్షల కోట్ల అప్పులను మాత్రమే చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహ చేసిన ఇతర అప్పులను చెప్పలేదు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో ఇచ్చిన ఈ సమాధానంను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో తమ స్వంత కుటుంబ మీడియా ద్వారా, లక్షలాది వలంటీర్ల ద్వారా బీజేపీ (BJP) రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.