బండ్లు ఓడలు అవుతాయ్ ఓడలు బండ్లు అవుతాయ్ అంటే ఇదేనేమో.. నిన్నటి దాకా ముఖ్యమంత్రికి నమ్మిన బంటు. నేడు ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రి. అతడే వీకే పాండియన్(VK Pandian). ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా (Private Secretary) పాండియన్ సేవలు అందించారు. 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి (IAS officer) అయిన పాండియన్ స్వచ్ఛంద పదవీ విమరణ తీసుకున్నారు. దీనికి సోమవారమే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఒక్క రోజులోనే ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సురేంద్ర కుమార్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పాండియన్ ను రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ ర్యాంకులో ‘5టీ’ చైర్మన్ గా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా పరిణామంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) విమర్శలు చేశారు. నిన్నటి దాకా అనధికారికంగా చేసింది, ఇప్పుడు అధికారికంగా మారిందంటూ సోషల్ మీడియా (Social media) లో పోస్ట్ పెట్టారు. ‘‘నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) కనిపించని భూస్వామి కావడంతో ఒడిశాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్య సహాయకుడు రాష్ట్ర సీఈవోగా వ్యవహరిస్తున్నాడు’’ అంటూ అందులో పేర్కొన్నారు.2011 నుంచి నవీన్ పట్నాయక్ కు సహాయకుడిగా పాండియన్ పనిచేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ లో పాండియన్ రాష్ట్రమంతా చుట్టిరావడం విమర్శలకు తావిచ్చింది. మోసర్కార్, శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్ట్, బీజూ స్వాస్త్య కల్యాణ్ యోజన (BS KY) తదితర కార్యక్రమాల రూపకల్పనలో పాండియన్ పాత్ర కీలకంగా పని చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో మార్పులకు కీలకంగా పనిచేశారు.